పొరుగు దేశం శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొంది. మాంద్యం కారణంగా దేశంలో నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో ఆహార పదార్థాలను కొనలేని ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎంతలా అంటే.. శ్రీలంక రాజధాని కొలంబోలో కప్పు టీ ధర రూ.100కి చేరింది. మిర్చి కిలో రూ.700లకు విక్రయిస్తున్నారు. కిలో బంగాళదుంపలకు రూ.200 వరకు చెల్లించాల్సి వస్తోంది.
లీటర్ పాలకు 2000 రూపాయలు చెల్లించాల్సిందే. ఇంధన కొరత విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పెద్ద పెద్ద నగరాల్లో 12 నుంచి 15 గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇలాంటి కష్ట సమయంలో భారత్ శ్రీలంక అండగా నిలిచింది. శ్రీలంక పరిస్థితి అర్ధం చేసుకున్న భారత ప్రభుత్వం ఇటీవల $2 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ను అందించింది.
జనవరి 2020 నుంచి శ్రీలంక విదేశీ మారక నిల్వలు 70 శాతం తగ్గాయి. శ్రీలంక విదేశీ కరెన్సీ నిల్వలు ఫిబ్రవరిలో 2.31 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కేవలం డిసెంబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలోనే శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు 779 మిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. ఒకేసారి ఇలా నిల్వలు పడిపోవడంతో శ్రీలంక దిగుమతులను నిలిపివేసింది. ఇది నిత్యావసర వస్తువుల కొరతకు దారితీసింది. విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో దేశంలో చాలా వరకు నిత్యావసర వస్తువులు, మందులు, పెట్రోల్, డీజిల్ విదేశాల నుంచి దిగుమతి కావడం లేదు.
ప్రజలు కూడా $ 0.75 (150) రూపాయలకు బ్రెడ్ ప్యాకెట్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు కిలో బియ్యం, పంచదార ధర రూ.290కి చేరింది. ప్రస్తుతం ఒక టీ కోసం రూ.100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345... ఇలా చెప్పుకుంటే పోతే శ్రీలంకలో సామాన్యుడి బతకడమే కష్టంగా మారింది.