విదేశీ అప్పులు భారీగా పెరిగిపోయి, మారకం నిల్వలు పూర్తిగా క్షీణించి, దిగుమతులు తగ్గిపోయిన క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతూ శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇదికాస్తా రాజకీయ సంక్షోభానికి దారితీసింది. గద్దె దిగడానికి రాజపక్స సోదరులు నిరాకరిస్తుండంతో సంక్షోభం అంతులేనిదిగా సాగుతున్నది.
శాంతిభద్రతతలు అదుపుతప్పిన క్రమంలోనే ఐదు వారాల్లో రెండోసారి ఎమర్జెన్సీ విధించినట్లు శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్స చెప్పుకున్నారు. భద్రతా బలగాలకు పూర్తి అధికారాలు అప్పగించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు దేశ అధ్యక్షుడు నల్లచట్టాలను అమలు చేస్తున్నారని అధ్యక్ష అధికార ప్రతినిధి తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా మారడానికి కారణమైన దేశాధ్యక్షుడు గోటబయా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె జరిపాయి. ఆ తర్వాతే దేశంలో గోటబయా ఎమర్జెన్సీ విధించడం గమనార్హం. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు, భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు లభిస్తాయి. నిరసనకారులను ఎవరినైనా ఎలాంటి కారణాలు చూపకుండానే అరెస్టు చేయొచ్చు.
తీవ్రమైన ఆహార కొరత, ఇంధన, ఔషధాల కొరతతో దేశ ప్రజలంతా నెలల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1948లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి ప్రస్తుత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణం అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైదొలగాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు.