శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులు చేయిదాటిపోయాయి. దేశాన్ని నడపలేని దుస్థితి, జనం తిరుగుబాటు నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి మహీంద రాజపక్స సోమవారం రాజీనామా చేశారు. అయితే, ఆయన సోదరుడు గొటబయ రాజపక్స మాత్రం ఇంకా అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు. రాజపక్స రాజీనామా తర్వాత శ్రీలంకలో హింస విస్పోటనంలా వ్యాపించింది. రాజపక్స మద్దతుదారులు రాజేసిన ఘర్షణలతో లంకా దహనం మొదలైంది.
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలంటూ గత నెల రోజులుగా శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తున్న జనంపై సోమవారం రాజపక్స మద్దతుదారులు దాడికి పాల్పడటంతో పరిస్థితి ఒక్కసారిగా చేయిదాటిపోయింది. రాజపక్స బస్సుల్లో వందలాదిమంది మద్దతుదారులను రప్పించి, నిరసనకారులపై దాడి చేయించినట్టు స్థానిక మీడియా పేర్కొంది.
రాజపక్స మద్దతుదారుల దూకుడుతో రెచ్చిపోయిన జనం మాజీ మంత్రులు, ఎంపీలు సహా అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలు, వాహనాలను తగలబెట్టేస్తున్నారు. ప్రధాని మహింద రాజపక్స రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పంపించారు. దేశాధ్యక్షుడు, ప్రధాని కార్యాలయాల ఎదుట నిరసనకారులపై రాజపక్స మద్దతుదారులు దాడి చేయడంతో 154 మంది గాయపడ్డారు. కాల్పులు కూడా చోటుచేసుకున్నాయి.
ప్రధాని నివాసం వద్ద నిరసనలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత ప్రేమదాస, ఆయన సహచరులపైనా దాడి జరిగింది. నిరసనకారులపై రాజపక్స మద్దతుదారుల దాడితో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దాడి అనంత రం బస్సుల్లో తిరిగి వెళ్తున్న రాజపక్స మద్దతుదారుల ను అనేక పట్టణాల్లో జనం అడ్డుకున్నారు. బస్సులను నిలిపివేసి దాడికి పాల్పడ్డారు.
దేశవ్యాప్తంగా అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపైనా జనం దాడికి పాల్పడుతున్నారు. కొలంబో, కురునెగల ప్రాం తాల్లో మాజీ మంత్రి జాన్స్టాన్ ఫెర్నాండో ఆస్తులతోపాటు హో టళ్లను తగలబెట్టారు. మరో మాజీ మంత్రి నిమల్ లాన్జా, మేయర్ సమన్ లాల్ ఫెర్నాండో, అధికార పార్టీ కార్మిక నేత మహింద కహన్ డగమగేల ఇళ్లనూ దహనం చే శారు.
ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా కర్ఫూ ను అమల్లోకి తెచ్చారు. తదుపరి ప్రకటించే వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. తాజా హింసలో 174 మంది గాయపడినట్టు పేర్కొన్నారు. కాగా, అధ్యక్షుడు గొటబయ రాజపక్స శుక్రవారం రాత్రి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. శ్రీలంకలో నెల వ్యవధిలో అత్యవసర పరిస్థితి ప్రకటించడం ఇది రెండోసారి.
‘ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశానికి మార్గదర్శకం చేసేలా అన్ని పార్టీలతో మీరు కొత్త ప్రభుత్వాన్ని నియమించేందుకు అనుకూలంగా నేను రాజీనామా చేస్తున్నా. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని గొటబయకు పంపిన రాజీనామా లేఖలో మహింద పేర్కొన్నారు. కాగా, అన్నిపార్టీలతో కొత్తగా అఖిలపక్ష కేబినెట్‌ను ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు గొటబయ రాజపక్స పార్లమెంటులో రాజకీయపార్టీలను ఆహ్వానించే అవకాశం ఉంది.
కాగా, అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షాలు మాత్రం సిద్దంగా లేవు. ఎన్నికలు జరిపించాలనే వారు పట్టుపడుతున్నారు. మధ్యంతర ప్రభుత్వంలో ప్రధాని పదవిని చేపట్టేందుకు తమ నేత సాజిత్ ప్రేమదాస అంగీకరించబోరని ప్రతిపక్ష పార్టీ ఎస్‌జేబీ(సమగి జన బలవెగయ) తెలిపింది. శ్రీలంకలో జరుగుతోన్న పరిణామాలపై పొరుగున ఉన్న భారత్ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
శ్రీలంక అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకొరల కారును నిట్టంబువా పట్టణంలో నిరసనకారులు అడ్డుకున్నారు. ఆ కారులో నుంచి నిరసనకారులపై కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన జనం ఆ కారును పల్టీకొట్టించారు. ఎంపీ సమీపంలోని ఓ భవనంలోకి పారిపోయి తలదాచుకోగా, ఆ భవనాన్ని వేలాదిమంది చుట్టుముట్టారు. దీంతో ఎంపీ తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
లంక ప్రజలు సంయమనం పాటించాలని మహింద రాజపక్స సోమవారం ట్విటర్లో కోరారు. ఈ ట్వీట్‌పై క్రికెటర్ కుమార సంగక్కర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ మద్దతుదారులే హింసకు పాల్పడ్డారు. గూండాలు, దుండగులు తొలుత మీ కార్యాలయానికి వచ్చి మిమ్మల్ని కలిశారు. ఆ తర్వాతే వారంతా శాంతియుత ఆందోళనకారులపై దాడికి పాల్పడ్డారు’ అని సంగక్కర నిందించారు.