ద్వీపదేశం శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారి, ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా తర్వాత పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. దేశ అధ్యక్ష భవనం మొదలుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికార పార్టీ ఆఫీసులు, పార్టీ నేతల ఇళ్లను నిరసన కారులు ధ్వంసం చేస్తున్నారు. పెద్ద ఎత్తున లూటీలు, దాడులు జరుగుతున్నాయి.
ప్రధానిగా మహీంద రాజీనామా చేసినా ఆయన సోదరుడైన గొటబయ రాజపక్స మాత్రం ఇంకా అధ్యక్షుడిగానే కొనసాగుతూ ఆర్మీకి విశేష అధికారాలు అప్పగించారు. దేశాన్ని కంట్రోల్ లోకి తీసుకోవడంలో భాగంగా రక్షణ శాఖ మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరాచకశక్తులు కనిపిస్తే కాల్చివేసే అధికారాలను త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) బలగాలకు కల్పిస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది.
రాజపక్స రాజీనామా తర్వాత ఆయన మద్దతుదారులు.. నిరసన కారులపై దాడులకు దిగడంతో హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. సోమవారం రాజపక్స రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే దేశవ్యాప్తంగా అల్లర్లు పేట్రేగాయి. అధికార పార్టీ నేతలు, రాజపక్స అనుచరులను నిరసనకారులు టార్గెట్ చేసిమసీ ప్రతిదాడులు చేస్తున్నారు. ఈక్రమంలోనే రాజపక్స పూర్వీకుల ఇంటిని సైతం నిరసనకారులు తగులబెట్టారు.
ఘర్షణల్లో ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు. అందులో ఒక ఎంపీ కూడా ఉన్నారు. రాజపక్స అనుచరులు దేశం విడిచి పారిపోకుండా నిరసనకారులు ఎయిర్ పోర్టులు, నేవీ బేస్ లు, రోడ్డు మార్గాలను దిగ్బంధించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికార పార్టీ నేతలను గుర్తించి మరీ పరుగెత్తించి కొడుతున్నారు. కొలంబో సిటీలో ఎటు చూసినా కాలిపోయిన వాహనాలు, ధ్వంసమైన దుకాణ సముదాయాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ, పోలీసు అధికారులు, అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసిన నిరసనకారులు.. చాలా చోట్ల అధికార పార్టీ నేతల ఇళ్లను కూడా ధ్వంసం చేస్తున్నారు. కొలంబోలోని శ్రీలంక ప్రధాని అధికారిక నివాసాన్ని కూడా ఆందోళనకారులు టార్గెట్ చేశారు. రాజపక్స నివాసం ఉన్న ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్ ట్రీస్ బిల్డింగ్ వద్దకు చేరుకుని ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు.
ప్రధాని నివాసం వద్ద బారికేడ్లు దాటుకుని వెళ్లాలని ప్రయత్నించిన వారిని పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకున్నారు. అయితే.. కాంపౌడ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులు లోపలికి పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో.. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం మంగళవారం నాడు మిలటరీకి, పోలీసులకు ఎమర్జెన్సీ అధికారాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే రాజపక్స కుటుంబం హెలికాప్టర్ లో సురక్షిత ప్రాంతానికి పారిపోయింది.
రాజపక్స కుటుంబంతో సహా హెలికాఫ్టర్‌లో వెళుతున్న దృశ్యాలు కూడా లంక మీడియాలో ప్రసారం కావడంతో ఆయన వెళ్లిపోయిన విషయం నిజమేనని స్థానిక మీడియా ధ్రువీకరిస్తోంది. రాజపక్స ప్రస్తుతం కుటుంబంతో సహా బస చేస్తున్న ఆ నేవీ బేస్ కొలంబో నగరానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. అధికారిక నివాసం ఖాళీ చేసి నేవీ బేస్‌లో రాజపక్స తలదాచుకున్నారు.
మాజీ ప్రధాని మహీంద రాజపక్స తన కుటుంబంతో పాటు హెలికాప్టర్ లో కొలంబో నుంచి పారిపోయి ట్రైన్ కోమలీ నేవీ బేస్ లో తలదాచుకున్నారు. రాజపక్స సోదరుడు గొటబయ ఇంకా అధ్యక్షుడిగా కొనసాగుతూ తన సోదరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజపక్స కుటుంబంతో కలిసి కోమలీ నేవీ బేస్ లో దాక్కున్నారనే సమాచారం తెలియడంతో నిరసనకారులు ఆయనను వెంటాడుతూ ఆప్రాంతాన్ని చుట్టుముట్టారు.
కోమలీ నేవీ బేస్ చుట్టూ సాయుధ బలగాలు తుపాకులతో సిద్ధంగా ఉన్నాయి. నేవీ బేస్ ప్రధాన గేటు వద్ద గుమ్మికూడిన నిరసనకారులు.. పెద్ద సౌడ్ వచ్చే మైక్ ల ద్వారా లోపలున్న రాజపక్స కుటుంబానికి హెచ్చరికలు చేశారు. ఈ దుస్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు రాజపక్స కుటుంబం విదేశాలకు పారిపోనుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే రాజపక్స కొడుకు, మాజీ ఎంపీ నమల్ రాజపక్స మాత్రం తాము దేశం విడిచి పోవడంలేదని ఓ ప్రకటన చేశాడు.
నిరసనలో హింసకు పాల్పడే వారిని అక్కడికక్కడే కాల్చి చంపేందుకు త్రివిధ దళాలకు అధికారాలు లభించిన నేపథ్యంలో రాజపక్స కుటుంబం తలదాచుకున్న నేవీ బేస్ లోకి ప్రవేశించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారు కాల్పులకు గురయ్యే అవకాశముంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇటు కొలంబో సిటీలో నిమిషనిమిషానికి పరిస్థితి మరింత జఠిలంగా మారుతున్నది.
శ్రీలంకలో నిరసనకారులు, కీలకమైన వాణిజ్య బృందాలు.. సంక్షోభంలో ఉన్న దేశాన్ని నియంత్రించేలా కొత్త ప్రభుత్వంఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. అయితే, ఎన్నికలు జరగకుండా అధికారాన్ని తీసుకోవడంగానీ, అధికార పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంగానీ కుదరని పని అని విపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా తప్పుకున్నాకే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని విపక్ష పార్టీలు అంటున్నాయి.
శ్రీలంకలో జరుగుతోన్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. శ్రీలంకలో శాంతి నెలకొనాలన్నదే తమ అభిమతమని, అందుకోసం అవసరమైన సహకారం అందిస్తున్నామని, అదే సమయంలో ఆకలి చావులు లేకుండా ఆహాన ధాన్యాలను సైతం అందిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. శ్రీలంకలో గంటగంటకూ పెరుగుతోన్న హింసాత్మక ఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ మిచెల్ బాచెలెట్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్నా గోటబయ రాజపక్స మాత్రం అధ్యక్ష పదవిని వీడటానికి అంగీకరించడంలేదు. నిరసనకారులు హింసాయుత చర్యలు ఆపాల్సిందిగా మంగళవారం మరోసారి ఆయన ప్రకటన చేశారు. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే ప్రజలు ఆయన మాట వినే పరిస్థితి లేకపోవడంతో ఆర్మీకి అదనపు అధికారాలిస్తూ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు.