సియారా లియోన్ రాజధాని ఫ్రీటౌన్ శివారు వెల్లింగ్టన్ అనే ప్రాంతంలో ఓ పెట్రోల్ బంకు వద్ద ఆయిల్ ట్యాంకర్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పెట్రోల్ ట్యాంకర్ కొద్దిగా ధ్వంసమై, అందులో నుంచి ఆయల్ లీకైంది. పెట్రోల్ రోడ్డుపైన వృధాగా పోతుండటంతో స్థానికులంతా దాని కోసం ఎగబడ్డారు. చేతికి దొరికిన వస్తువును తీసుకెళ్లి అందులో పెట్రోల్ నింపుకునే ప్రయత్నం చేశారు (photo credit AP)
ఆయిల్ ట్యాంకర్ పేలుడు సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఫ్రీటౌన్ ఆస్పత్రులన్నీ కాలిపోయిన వారితోనే నిండిపోయాయి. ఇప్పటిదాకా 92 మృతదేహాలను గుర్తించామని, మరో వంద మందిదాకా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని, వారిలో కనీసం 30 మంది బతికే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. (photo credit AFP)
సియోరా లియోన్ ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటనను జాతీయ విపత్తుగా గుర్తిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు మొహ్మద్ జుల్దే జాలోహ్ ప్రకటించారు. శుక్రవారం రాత్రే ఘటనా స్థలానికి వచ్చిన ఆయన.. క్షతగాత్రులు చికిత్స పొందుతోన్న ఆస్పత్రులను సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, కష్ట సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. (photo credit AFP)
ఆయిల్ ట్యాంకర్ పేలుడులో వందల మంది మరణించారన్న వార్తతో సియోరా లియోన్ అధ్యక్షుడు జులియస్ మాడ బయో దిగ్భ్రాంతి చెందారు. కాప్ 26 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం స్కాట్లాండ్ లో ఉన్న ఆయన.. ఉపాద్యక్షుడు, ఇతర అధికారులకు ఫోన్లు చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పర్యటనను వీలైనంత తొందరగా ముగించుకుని ఆయన స్వదేశానికి వెళ్ళనున్నారు. (photo credit Getty Images)
ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరలయ్యాయి. సియోరా లియోన్ రాజధాని ఫ్రీటౌన్ శివారులో అత్యంత రద్దీగా ఉండే సూపర్ మార్కెట్ ఛోయిత్రామ్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది లారీ కాదు, బస్సు అని, పేలుడు ధాటికి బస్సులోని ప్రయాణికులు కూడా ఆహుతైపోయారని కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. (photo credit AFP)
ఆఫ్రికా దేశం సియోరా లియోన్ లో ఒక లీటరు పెట్రోలు 17,839 లియోన్లు(స్థానిక కరెన్సీ)గా ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.120. దేశ జనాభాలో పెట్రోల్ వాడే వారి సంఖ్య కేవలం 2శాతంగా ఉంటుంది. చాలా పనుల్లో కిరోసిన్ ను మాత్రమే వాడుతుంటారు. సియోరా లియోన్ లో నూటికి 95 మంది కట్టెలపొయ్యిమీదే వంట చేస్తుంటారు. పెట్రోల్ ధర భారీగా ఉండటంతో దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలనే తాపత్రయమే ఇతటి ఘోరానికి దారితీసింది.