ప్రధాని జర్మనీ పర్యటనలో భాగంగా సోమవారం ఇరుదేశాల మధ్య భారీ ఒప్పందాలు కుదిరాయి. గ్రీన్ డెవల్‌పమెంట్, ఆగ్రో-ఎకాలజీ రంగాల్లో భారత్‌కు ఇతోధికంగా సాయం అందించడానికి జర్మనీ ముందుకొచ్చింది. భారత్‌లో క్లీన్ ఎనర్జీ (పర్యావరణహిత ఇంధనం) వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుమారు రూ.80వేల కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించింది.
2030 నాటికి జర్మనీ ఈ నిధులను భారత్‌కు సమకూర్చనుంది. దీంతోపాటు... వ్యవసాయ రంగంలో సహజ వనరుల వినియోగం (ఆగ్రో-ఎకాలజీ), సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, ఉమ్మడి పరిశోధనలు, ఇన్నోవేషన్ అంశాల్లో భారత్‌కు జర్మనీ సహకారం అందించనుంది. ఇందులో భాగంగా జర్మనీ... రాయితీలతో సుమారు రూ.24వేల కోట్ల రుణాన్ని భారత్‌కు అందించనుంది.
2025 నాటికి ఈ రుణం భారత్‌కు అందనుంది. ఆగ్రో-ఎకాలజీ విషయంలో ప్రైవేటు రంగానికి కూడా భాగస్వామ్యం కల్పిస్తారు. ఈ మేరకు ఇరుదేశాల మధ్య జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) సదస్సులో ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్... జాయింట్ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియా మావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, అందరూ నష్టపోతారని అన్నారు. ఈ విషయంలో భారత్ శాంతి వైపునే ఉంటుందని పునరుద్ఘాటించారు. సదస్సుకు ముందు... జర్మనీ చాన్స్‌లర్‌తో ప్రధాని సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు, సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.
బెర్లిన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో భారత్ మాతా కీ జై, జైశ్రీరామ్ నినాదాలతోపాటు 2024 ఎన్నికలకు సరికొత్త నినాదం పురుడుపోసుకుంది. ‘ట్వంటీ ట్వంటీఫోర్.. మోదీ వన్స్ మోర్’ (2024..Modi Once More) అంటూ ప్రవాసులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ప్రవాసులను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. ఇప్పుడు భారత్ రిస్క్ తీసుకోవడానికి భయపడదని, పెద్ద ఆలోచనలు చేస్తుందని ప్రధాని అన్నారు. భారతీయులు అని అన్నప్పుడల్లా ప్రవాసులు కూడా అందులోకే వస్తారని పేర్కాన్నారు. ఇండియాలో ఇప్పుడు ప్రభుత్వం కాదు.. ప్రజలే చోదక శక్తిగా తయారయ్యారని, .దేశ భద్రత, భవిష్యత్తు గురించి చింతలేదని మోదీ అన్నారు.
యూరప్ పర్యటనలో ప్రధాని మోదీ వెంట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. ద్వైపాక్షిక అంశాలపై జరిగిన చర్చల్లో ఇరుదేశాలకు చెందిన మంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంగళవారం నాడు మోదీ డెన్మార్క్ లో పర్యటిస్తున్నారు. ఆపై ఫ్రాన్స్ వెళతారు.