నుంచి సోమవారం నాడు బెర్లిన్ వచ్చిన ప్రధాని మోదీ అక్కడ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ తో భేటీ కావడం, ఇరు దేశాల మద్య రూ.80వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరగడం తెలిసిందే. మంగళవారం నాడు కోపెన్‌హెగెన్ సిటీకి చేరుకున్న మోదీకి డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్ ఘన స్వాగతం పలికారు. డెన్మార్క్ ప్రధాని స్వయంగా తన అధికారిక నివాసానికి (మ్యారీన్బోర్గ్) మోదీని తీసుకెళ్లారు. అక్కడి లాన్ లో ఇరుదేశాధినేతలు కలియదిరిగన ఫొటోలు వైరలయ్యాయి. ప్రధాని హోదాలో మోదీ డెన్మార్క్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
కోపెన్‌హెగెన్ సిటీలోనే మంగళవారం రాత్రి బసచేసిన మోదీ.. బుధవారం నాడు నోర్దిక్ దేశాల అధినేతలతో తొలుత ద్వైపాక్షిక చర్చలు, ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ దేశాలను కలిపి నోర్డిక్ దేశాలు లేదా స్కాండినేవియన్ దేశాలుగా వ్యవహరించడం తెలిసిందే. ద్వైపాక్షిక బంధాలతోపాటు నోర్దిక్ కూటమితోనూ భారత్ ప్రత్యేక బంధాన్ని కొనసాగిస్తున్నది.
కోపెన్‌హెగెన్ వేదికగా భారత్-నోర్డిక్ దేశాల మధ్య సదస్సు జరగడం చరిత్రలో ఇది రెండోసారి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలు, పెట్టుబడి, స్వచ్ఛమైన శక్తి, ఆర్కిటిక్ పరిశోధన, వంటి మరికొన్ని రంగాలలో నార్డిక్ ప్రాంతంతో బహుముఖ సహకారానికి ప్రోత్సాహం అందించే దిశగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. నోర్దిక్ దేశాలతో సదస్సులో భారత్ ప్రాధాన్యతలను ప్రధాని మోదీ వివరించారు.
నోర్దిక్ ప్రాంతంలోని ఐదు దేశాల్లో ఒక్క నార్వే తప్ప మిగతా నాలుగు దేశాలకూ (ఫిన్లాండ్, ఐస్ లాండ్, స్వీడన్, డెన్మార్క్) మహిళలే అధినేతలతుగా ఉండటం తెలిసిందే. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్, ఐస్లాండ్ ప్రధాని కట్రిన్ జాకబ్స్‌డొట్టిర్, స్వీడన్ ప్రధాని మాగ్ధలీనా ఆండర్సన్, డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్ రాజకీయాలతోపాటు వ్యక్తిగత జీవితాల్లోనూ స్టార్ మహిళలుగా ప్రచుర్యం పొందారు. ఈ నలుగురితోపాటు నార్వే ప్రధాని జోనాస్ గహ్ర్ స్టోర్ తోనూ ప్రధాని విడివిడిగా, ఉమ్మడిగా సమావేశాలు జరిపారు.
ఆయా దేశాల అధినేత్రులను కలుసుకున్నప్పటి ఫొటోలను షేర్ చేస్తూ ఆయా దేశాలతో భారత్ బంధం మరింత బలోపేతం అయ్యేందుకు చేసిన చర్చలను మోదీ ఎప్పటికప్పుడు పోస్టులుపెట్టారు. కోపెన్‌హెగెన్ వేదికగా డెన్మార్క్ తో జరిగిన వ్యాపార సదస్సు, భారత ప్రవాసులతో సమావేశంలో మోదీ కీలక అంశాలను ప్రస్తావించారు, ప్రస్తుతం యూరప్ ను అతలాకుతలం చేస్తోన్న యుద్ధ పరిణామాలపైనా ఆయన స్పందించారు.
ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని ప్రధాని ఆకాంక్షించారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని పిలుపునిచ్చారు. డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్తో సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ సంక్షోభం గురించి ఇద్దరూ చర్చించారు. భారత్ తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని విరమించడానికి రష్యాను ఒప్పించాలని డెన్మార్క్ ప్రధాని కోరారు.
ఇండియా-డెన్మార్క్ బిజినెస్ ఫోరంను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. భారత్‌లోని మౌలిక సదుపాయాల రంగం, గ్రీన్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని డెన్మార్క్‌కు చెందిన కంపెనీలు, పెన్షన్ ఫండ్లను ఆహ్వానించారు. ఈ సందర్భంలోనే, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం విషయంలో మద్దతు ఇస్తున్నట్టు డెన్మార్క్ ప్రధాని పునరుద్ఘాటించారు.
బుధవారం నాటి నోర్దిక్ దేశాల సదస్సులోనూ కీలక అంశాలను ప్రస్తావించిన మోదీ, ఇవాళే కోపెన్‌హెగెన్ నుంచి పారిస్ నగరానికి చేరుకుంటారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో చర్చలు జరుపుతారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని కనబరుస్తూ, అదే సమయంలో రష్యాతో ఆయిల్ ఒప్పందాలపైనా విమర్శలు రాకుండా జాగ్రత్త వహిస్తున్నది.
మోదీ రాకకు కొద్ది గంటల ముందు ఫ్రాన్స్ దేశం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇండియన్ నేవీ కోసం సంప్రదాయ పీ-75ఐ సబ్మెరైన్ల నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులో తాము పాల్గొనడం లేదని ఫ్రాన్స్ నేవీ విభాగం మంగళవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో పేర్కొన్న షరతులు తమకు ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ నేవీ వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడితో స్వల్ప కాలిక భేటీ తర్వాత ప్రధాని మోదీ పారిస్ నుంచి ఢిల్లీ తిరుగుపయనం అవుతారు.