పాకిస్థాన్ రాజకీయాల్లో పాకిస్థాన్ సైన్యానిది కింగ్ మేకర్ పాత్ర. 1947లో పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సగం సమయం సైన్యం పాలనలోనే ఉంది. పాకిస్తాన్‌లోని సైన్యానికి ఎన్నో అధికారాలు ఉన్నాయి. అలాంటివి మరే ఇతర దేశానికి ఉండవు. బ్యాంకులు, భూముల నుంచి కిరాణ దుకాణాల వరకు జోక్యం చేసుకుంటుంది.
'డాన్' కథనాల ప్రకారం.. పాకిస్థాన్‌లో ప్రభుత్వ భూమి అనేదేమీ లేదు. ఇక్కడ దాదాపు 80 శాతం భూమి సైన్యం ఆధీనంలో ఉంది. ఇందులో వ్యవసాయ భూమి కూడా ఉంది. సైన్యం అనుమతి లేకుండా ఎవరూ భూమిని కొనలేరు. అమ్మలేరు. చాలా భూభాగంలో సైన్యం సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. పాకిస్థాన్‌లో రిటైర్డ్ ఆర్మీ చీఫ్ సిబ్బందికి 400 ఎకరాల వ్యవసాయ భూమిని ఉచితంగా కేటాయించారు.
'బిజినెస్ లైన్' నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం 85 నుంచి 90శాతం వరకు పాక్ ఆర్మీ జోక్యం చేసుకుంటుంది. పాక్ సైన్యం.. ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్ (AWT) పేరుతో ఒక ట్రస్ట్‌ను నడుపుతోంది. ఇది పాకిస్థాన్‌లోని అతిపెద్ద బ్యాంక్ 'అష్కరీ కమర్షియల్ బ్యాంక్'తో సహా చాలా ఆర్థిక సంస్థలను నియంత్రిస్తుంది.
హౌసింగ్ ప్రాజెక్టులు, నిర్మాణ సంస్థలు, రవాణా సంస్థలు కూడా పాక్ సైన్యం నియంత్రణలో ఉన్నాయి. టెలికాం పరిశ్రమ, ఎగుమతి-దిగుమతి రంగాన్ని కూడా నియంత్రిస్తుంది. దేశంలోని అతిపెద్ద విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు కూడా సైన్యం ఆధీనంలో ఉంటాయి. 'ఎలైట్ పబ్లిక్ స్కూల్' అనే స్కూల్ నెట్‌వర్క్‌ను కూడా నడుపుతోంది.