ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితుల్లో ఉందని కిమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్యాంగ్యాంగ్లో జరిగిన రాజకీయ సదస్సులో ఆయన వేలాది మంది కార్యకర్తల సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని కిమ్ జాంగ్ చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఈ సంకట పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ఈ సవాళ్లను దాటుకుంటూ దేశం యధాస్థితికి చేరుకోవడానికి కార్యకర్తలంతా పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు.
జనవరిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని, ఆ బాధ్యత కార్యదర్శులదేనని కిమ్ చెప్పుకొచ్చారు. పార్టీ క్షేత్రస్థాయి విభాగాలను కిమ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులను తక్షణమే సరిదిద్దుకోవాలని.. పార్టీలో ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. పదేళ్లుగా ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ జాంగ్ ఉన్‌కు ప్రస్తుతం కచ్చితంగా కష్ట కాలమేనని.. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించిందని మేధావులు చెబుతున్నారు.
దానికి తోడు.. కిమ్‌తో కయ్యం నేపథ్యంలో అమెరికా ఆంక్షలను అమలు చేస్తుండటం కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దీన స్థితికి మరో కారణమని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని కాదని కిమ్ జాంగ్ ఉన్ చేసిన అణ్వాయుధ పరీక్షలతో ఆంక్షల తీవ్రత మరింత పెరిగి ఉత్తర కొరియా మరిన్ని చిక్కుల్లో పడింది. ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఆ దేశం ప్రకటించడం కొసమెరుపు.
ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా ఉత్తర కొరియా తెలియజేయడం గమనార్హం. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 23,121 కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని ఉత్తర కొరియా డబ్ల్యూహెచ్‌వోకు నివేదిక సమర్పించింది. అయితే.. వీటి ఫలితాలన్నీ నెగిటివ్‌గానే వచ్చినట్లు తెలిపింది. చైనాతో ఉత్తర కొరియాకు బలమైన వాణిజ్య బంధమే ఉంది.
కరోనా వైరస్ తొలుత చైనాలోనే పుట్టిందని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్న ఈ తరుణంలో కూడా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలున్న ఉత్తర కొరియా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా తమ దేశంలో నమోదు కాలేదని ప్రకటించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. ఉత్తర కొరియా ఇప్పటికే దేశ సరిహద్దులను మూసివేసింది. కొన్ని దేశాలతో మాత్రమే వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది. అలా వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్లో ఉంచుతున్నట్లు తెలిసింది.