నాసా(NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (CSA) కలిసి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) అనే ఫ్లాగ్షిప్ అబ్జర్వేటరీని అభివృద్ధి చేశాయి. 1990లో రోదసీలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు ఇది నెక్స్ట్ లెవెల్ టెలిస్కోప్‌గా రోదసిలోకి అడుగుపెట్టబోతోంది.
ఈ నెల డిసెంబర్ 25న క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) ను లాంచ్ చేయడానికి నాసా సిద్ధమైంది. ఒక టైమ్ మెషిన్ లాగా పనిచేసే జేడబ్ల్యూఎస్ టెలిస్కోప్ లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో శాస్త్రవేత్తలకు వివరించనుంది. విశ్వం పుట్టుక గుట్టు రట్టు చేయగల జేడబ్ల్యూఎస్ టెలిస్కోప్‌ను టైమ్ మెషిన్ అని ఎందుకు అంటున్నారంటే..
1990లో రోదసిలోకి పంపిన హబుల్ టెలిస్కోప్ విశ్వంపై మన అవగాహనను పూర్తిగా మార్చేసింది. నాలుగు రోజుల్లో అంతరిక్షంలోకి వెళ్లనున్న జేడబ్ల్యూఎస్ టెలిస్కోపు మాత్రం విశ్వంలో ఏర్పడిన కొన్ని తొలి గెలాక్సీలను కనుగొనడానికి.. అవి ఎలా ఉనికిలోకి వచ్చాయో అర్థం చేసుకోవడానికి ఖగోళ శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. ఇది పాలపుంతతో సహా ఇతర గెలాక్సీల పుట్టుక గురించి మరిన్ని వివరాలు తెలియజేయనుంది.
మళ్లీ దశాబ్ద కాలం తర్వాత డిసెంబరు 2021 ప్రయోగించడానికి నాసా సిద్ధమైంది. అయితే ఇప్పుడు దీని ప్రస్తుత అంచనా వ్యయం దాదాపు 10 బిలియన్ డాలర్లు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.జేడబ్ల్యూఎస్‌టీ రూపకల్పన, ఇంప్లీమెంటేషన్ దశల్లో అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. 2005లో ఒక భారీ రీడిజైన్ చేయాల్సి వచ్చింది.
జేడబ్ల్యూఎస్‌టీ షెడ్యూల్ ప్రకారం, ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ అంతరిక్ష కేంద్రం నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు (ESA) చెందిన ఏరియాన్ 5 రాకెట్ ద్వారా టెలిస్కోపును ప్రయోగించాలని నాసా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఖగోళ శాస్త్రవేత్తలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్ ఔత్సాహికులు ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా లేదా అని ఊపిరి బిగపట్టుకొని మరీ వెయిట్ చేస్తున్నారు.
విజయవంతమైన ప్రయోగం అనేది అత్యంత సంక్లిష్టమైన పనుల్లో మొదటి అడుగు మాత్రమే. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను స్థానంలో ఉంచడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. భూమి చుట్టూ తిరిగే హబుల్ వలె కాకుండా, జేడబ్ల్యూఎస్‌టీ భూమికి దాదాపు 15,00,000 కి.మీ దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండే రెండవ లాగ్రాంజ్ పాయింట్ (L2) వద్దకు చేరుకుంటుంది.
జేడబ్ల్యూఎస్‌టీ లాంచ్ అయ్యే ప్రదేశం టెలిస్కోప్ ఎల్లప్పుడూ సూర్యుని నుంచి దూరంగా ఉండేలా చేస్తుంది. సూర్యుడికి దూరంగా ఉంటేనే టెలిస్కోప్ అనేది విశ్వంపై అల్ట్రా-సెన్సిటివ్ పరిశీలనలను చేయగలదు. హబుల్ వలె కాకుండా, జేడబ్ల్యూఎస్టీకి వ్యోమగాములు హెల్ప్ చేయలేరు. జేడబ్ల్యూఎస్‌టీ ప్రయోగం, విస్తరణ అనేది ఎటువంటి తప్పు చేయకుండా ప్రయోగించాల్సిన మోస్ట్ ఛాలెంజింగ్ అంతరిక్ష మిషన్లలో ఒకటి.
ప్రయోగించిన 30 నిమిషాల తర్వాత జేడబ్ల్యూఎస్‌టీ ఏరియన్ రాకెట్ నుండి విడిపోతుంది. ఆపై దాని సౌర శ్రేణులను విస్తరిస్తుంది. ఇది ఎల్2(L2) వైపు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అవసరమైన శక్తిని సరఫరా చేస్తుంది. జేడబ్ల్యూఎస్‌టీ దాని మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, టెలిస్కోప్‌ను చల్లగా ఉంచడానికి అవసరమైన భారీ సూర్య కవచాలు విస్తరణను ప్రారంభిస్తాయి. అప్పటికీ ఈ టెలిస్కోప్ పూర్తిగా తెరుచుకోదు.
లాంచ్ అయిన ఒక వారం తర్వాత, సూర్య కవచాలు పూర్తిగా టెన్నిస్ కోర్ట్ అంత పెద్ద పరిమాణంలో విస్తరిస్తాయి. దాదాపు రెండు వారాల తర్వాత తన మడతలన్నీ విప్పుకుని 6.5-మీటర్ల వ్యాసం కలిగిన ప్రైమరీ మిర్రర్ బయటికి వస్తుంది. లాంచ్ అయిన దాదాపు 30 రోజుల తర్వాత టెలిస్కోప్ దాదాపు ఓపెన్ అవుతుంది. ఆపై జేడబ్ల్యూఎస్‌టీ L2కి చేరుకుంటుంది. చివరి కక్ష్యలో ల్యాండింగ్ దిద్దుబాట్లు, ప్లేస్మెంట్లు ప్రారంభమవుతాయి.
అసలైన స్థానానికి చేరుకున్న తర్వాత, సైన్స్ ఇన్స్ట్రుమెంట్లను ఆన్ చేయడం, టెస్టింగ్ చేయడం వంటి సంక్లిష్టమైన పని ప్రారంభమవుతుంది. ఈ పనుల్ని పూర్తి చేయడానికి ఆరు నెలల వరకు టైమ్ పట్టవచ్చు. 13.5 బిలియన్ (1350 కోట్ల) కాంతి సంవత్సరాల క్రితమే ఏర్పడ్డ గెలాక్సీ నిర్మాణాన్ని అధ్యయనం చేయడంలో ఈ సాధనం చాలా ఉపయోగపడుతుంది.
విశ్వం పుట్టుక సమయంలో ఎలా ఉంది? మొదటి నక్షత్రాలు కేవలం చీకటి నుంచి చీల్చుకుంటూ ఎలా ఉనికిలోకి వచ్చాయి? చిమ్మ చీకటిగా ఉండే విశ్వం కాంతితో ఎలా వెలిగిపోయింది? వంటి అంశాలను శాస్త్రవేత్తలకు తెలియజేయడంలో ఈ టెలిస్కోప్ ఒక టైమ్ మెషిన్ గా పనిచేస్తుంది. జేడబ్ల్యూఎస్‌టీ ఖగోళ దర్పణం కాలక్రమేణా మందమైన గెలాక్సీల పరిశీలిస్తుంది. దట్టమైన ధూళి, మేఘాల లోతుల్లోకి చూడగల ఈ టెలిస్కోప్ కొత్త నక్షత్రాలు, గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోగలవు.
ఈ టెలిస్కోప్ మన సౌర వ్యవస్థలోని వస్తువుల వివరణాత్మక వీక్షణను అందించడంతో పాటు సూర్యుల చుట్టూ తిరిగే నివాసయోగ్యమైన ఎక్సోప్లానెట్ల వాతావరణాన్ని అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది. జేడబ్ల్యూఎస్‌టీ విశ్వంలోని భూభాగంలో అడుగుపెడుతుంది. ఇది మనం ఎక్కడి నుంచి వచ్చామనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఈ ప్రక్రియలో కొత్త తరం శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిస్తుంది.