మకీపాక్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న యూరప్ ఖండంలో నడిమధ్యన ఉండే బెల్జియం దేశం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెరుగుతోన్న దరమిలా అప్రమత్తమైన ప్రభుత్వం.. మంకీపాక్స్ వైరస్ సోకినవారికి కనీసం 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆదేశాలు వెలడగా, మంకిపాక్స్ బాధితులకు క్వారంటైన్ అమలుచేస్తున్న తొలి దేశంగా బెల్జియం నిలిచింది. (ప్రతీకాత్మక చిత్రం)
బెల్జియంలో ఇప్పటివరకు 14 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఓడరేవు పట్టణమైన అన్ట్‌వెర్ప్‌లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అన్ని కేసులు ఆ పట్టణంతోనే ముడిపడి ఉన్నాయని, బాధితులంతా ఓ వేడుకలో కలిసిపాల్గొన్నారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా పాజిటివ్ వచ్చినవారికి 21 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తున్నామన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ ఆదివారం నాటికి ఆసియా ఖండంలోనికీ ప్రవేశించింది. ఇజ్రాయెల్ లో తొలి కేసు నమోదైంది. స్విట్జర్లాండ్‌లోనూ కేసులు వచ్చినట్లు వెల్లడైంది. 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది. (ప్రతీకాత్మక చిత్రం)
మంకీపాక్స్ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తున్నట్లు ఇప్పటిదాకా ఆధారాలు లేనప్పటికీ, దీనిపై సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో తాజాగా ఇజ్రాయెల్, స్విటట్జర్లాండ్ లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ సైతం అప్రమత్తమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏమిటీ మంకీపాక్స్?: స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది. (ప్రతీకాత్మక చిత్రం)
చికిత్స ఎలా?:ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు. మందులేని వైరస్ కావడంతో మంకీపాక్స్ పై ఆందోళనలు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)