దేశంలో పులులు ఎన్ని ఉన్నాయి? ఏ జాతి పులుల సంఖ్య ఎంత? వాటి సంఖ్య తగ్గుతోందా? పెరుగుతోందా? ఇలా పులులకు సంబంధించి మనకు ఎన్నో ప్రశ్నలుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. నాలుగేళ్లలో 700 పులులు పెరిగాయన్న మోదీ... 2,967 పులులతో ఇండియా పులులకు అత్యంత ఆవాసయోగ్యమైన దేశంగా ఉందన్నారు.
ఆశ్చర్యకర విషయమేంటంటే... పులులు ఎక్కువగా చనిపోతున్నది చైనాలోనే. ఇండియాలో చాలా పులుల్ని కూడా చంపి... చైనాకే అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడ వాటి గోళ్లు, చర్మం వంటివి వేరు చేసి... అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. చైనా మందుల తయారీలో కూడా పులుల్ని వాడేస్తున్నారు. ఇక వాటి సంఖ్య తగ్గకుండా ఎలా ఉంటుంది.
పరిశ్రమలు, ఇళ్లు పెరుగుతున్నాయి. అడవులు తగ్గుతున్నాయి. మరి పులులు ఎక్కడ బతకాలి? ఖర్మ కాలి ఏ పులో... దారి తప్పి గ్రామాల వైపు వస్తే... దాన్ని చంపేయడమో, చితకబాదడమో చేస్తున్నారు. ప్రాణభయంతో వాళ్లు అలా చేస్తున్నా... అంతిమంగా పులులు ఊళ్లలోకి రావడానికి కారణం మాత్రం మనమే. వాటి ఆవాసాల్ని (అడవుల్ని) మనం ఆక్రమిస్తుంటే... అవి మాత్రం ఏం చేస్తాయి?
ఈ వాస్తవాల్ని బయటపెడుతూ... 2018కి సంబంధించి పులుల పూర్తి వివరాల్ని నేడు ప్రధాని నరేంద్రమోదీ రిపోర్టు రూపంలో రిలీజ్ చేశారు. మన దేశంలో ప్రతి నాలుగేళ్ల కోసారి పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు. 2006, 2010, 2014లో లెక్కించారు. 2018 లెక్కను ప్రధాని ప్రకటించారు. పులుల సంఖ్య పెరగడం చరిత్రాత్మక విజయమన్న మోదీ... అత్యంత నిబద్ధతతో ఇది సాధ్యమైందన్నారు.