Women's Day Special 2021 : విజయం దక్కినా, దక్కకపోయినా, బతికినా, ఓడినా... ఆ మహిళలు మాత్రం చరిత్ర తిరగరాశారు. శత్రువులు సంకెళ్లతో బంధిస్తున్నా శక్తివంచన లేకుండా పోరాడారు. మగాళ్లతో పోల్చితే మహిళలు అంత శక్తిమంతంగా ఉండరన్నది ఓ భావన. ఈ దురుద్దేశం వల్లే అనాదిగా మహిళల్ని వంటింటికే పరిమితం చేస్తూ... వారి ఆశలూ, కలలను కాలరాశారు. ఒకప్పుడైతే మరీ దారుణం. ఎవరైనా మహిళ సమాజాన్ని ఎదిరించి ఓ అడుగుముందుకేస్తే చాలు అడ్డమైన శిక్షలూ వేసేవాళ్లు. మార్పు కావాలని అందరూ చెబుతారు. ఆ మార్పు మగాళ్లతో సరి సమానంగా మహిళలు దూసుకెళ్లేంతలా మాత్రం ఉంటే సహించలేరు. అలాంటి మార్పుని కోరుకుంటూ కొందరు మహిళలు... మగాళ్ల వేషంలో పోరాడారు. అందుకు ఏయే పరిస్థితులు దారి తీశాయో, వారి పోరాటాలు ఎలా సాగాయో... మహిళా దినోత్సవం నాడు తెలుసుకుందాం.
జే కే రోలింగ్... హ్యారీ పోటర్ నవలా రచయిత్రిగా ప్రపంచానికి తెలుసు. కానీ ఎంత మందికి తెలుసు... మొదట్లో ఆమె తన రచనలపై పూర్తి పేరు కాకుండా కేవలం జే కే అని మాత్రమే పెట్టుకునేవారని. తాను మహిళ అని తెలిస్తే, తన రచనలు చదవరన్న ఉద్దేశంతో ఆమె అలా చేసేవారు. హ్యారీ పోటర్ తొలి నవలల విషయంలో కూడా తన పూర్తి పేరును రాయలేదు. వాటిని ఎక్కువగా చదివేది కుర్రాళ్లేనని భావించిన ఆమె... ఓ మహిళ ఆ కథ రాసిందంటే చదవరేమోనని అనుకున్నారు. ఐతే... యూత్ ఆమెకు గ్రాండ్ వెల్కం చెప్పారు. ప్రపంచ గుర్తింపు తెచ్చారు. (Image: Reuters)
క్యాథెరిన్ స్విట్జర్... బోస్టన్ మారథాన్‌లో పరుగెత్తిన మొదటి మహిళ. అప్పట్లో మహిళలు సరిగా పరుగెత్తలేరన్న ప్రచారం ఉండేది. 1967లో బోస్టన్ మారథాన్‌లో పాల్గొనాలనుకున్న ఆమె... తన పేరును K V స్విట్జర్ అని రాశారు. తద్వారా తాను మహిళ కాదన్నట్లుగా నమ్మింపజేశారు. బ్యాగీ స్వెట్ షర్ట్ వేసుకున్న ఆమెను చూసి మగాడే అనుకున్నారంతా. తీరా మారథాన్‌లో పాల్గొన్నాక... ఆమె పెదవులపై ఉన్న లిప్‌స్టిక్ వల్ల ఆమె, అతడు కాదని అర్థమైంది. ఆమెను పరుగు పందెం నుంచీ తప్పుకోవాలని అధికారులు అరిచారు. అందుకామె ఒప్పుకోలేదు. మొత్తానికి మారథాన్ పూర్తిచేశారు. అదే పట్టుదలతో 1974లో న్యూయార్క్ మారథాన్‌లో పాల్గొని విజయం సాధించారు. (Image: Flickr)
జాన్ ఆఫ్ ఆర్క్... ఒర్లియాన్స్ సేవకురాలిగా పేరు పొందారు. 15వ శతాబ్దానికి చెందిన ఓ రైతు కూతురామె. ఫ్రాన్స్‌పై బ్రిటిషర్ల ఆధిపత్యంపై ఆమె ఎదురు తిరిగారు. వందేళ్ల యుద్ధంలో పాల్గొన్న ఆమె, మగాడి వేషంలో పోరాడారు. కోర్టు ద్వారా మిలిటరీలో చేరేందుకు అనుమతి పొందిన ఆమె... బ్రిటిషర్ల నుంచీ నరకం చూశారు. ఆమెను బంధించిన బ్రిటిషర్లు రకరకాల కేసులు నమోదు చేశారు. వాటిలో మగాడి డ్రెస్ వేసుకున్న కేసు కూడా ఉంది. 19 ఏళ్లప్పుడే ఆమె సజీవ దహనం చేశారు. తర్వాత ఆమెను నిరపరాధిగా గుర్తిస్తూ... అమరజీవిగా ప్రకటించారు. (Image: Pexels)
డాక్టర్ జేమ్స్ బ్యార్రీ... మార్గరేట్ అన్న్ బల్క్లీ (ఎడమవైపు) తన అంకుల్ పేరైన జేమ్స్ బ్యార్రీ పేరు పెట్టుకుని 1780లో మెడికల్ స్కూల్లో చేరింది. ఐర్లాండ్ అప్పట్లో మహిళలకు వైద్య రంగంలో అనుమతులు ఇవ్వలేదు. బ్యార్రీ తన జీవితమంతా మగాళ్ల డ్రెస్సులోనే కనిపించింది. ఎప్పుడూ ఓవర్ కోటే వేసుకునేది. బొంగురు గొంతుతో మాట్లాడేది. బ్రిటీష్ ఆర్మీలో మిలిటరీ సర్జన్‌గా పనిచేసింది. ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా చేసింది. సీ సెక్షన్ ఆపరేషన్లకు ఆమే మొదటి సర్జన్. ఆమె చనిపోయాక, అంత్యక్రియలు జరిపేటప్పుడు మాత్రమే ఆమె అతడు కాదనీ... మహిళ అనీ తెలిసింది. (Image: Public Domain)
ఆగ్నోడైస్... ప్రాచీన గ్రీస్‌లో మహిళల్ని కించపరిచేవారు. మగాళ్ల కింద పడి వుండాలనేవారు. ఆగ్నోడైస్.. మగాళ్ల రూపంలో ఉంటూ... మహిళా కార్మికులకు సాయం చేసేది. గాయపడిన మహిళలకు ఓ మగ డాక్టర్లా సేవలు చేసేది. ఆమెకు మగ డాక్టర్‌గా మంచి పేరు రావడంతో... ఇతర మగ డాక్టర్లు ఆమెపై తిరగబడ్డారు. మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. మహిళా రోగులంతా కోర్టుకు వెళ్లి... ఆమె మగాడు కాదనీ... మహిళ అనీ చెప్పడంతో... గ్రీస్ పాలకులు ఆశ్చర్యపోయారు. అప్పటికప్పుడు ఏథెన్స్ చట్టాల్ని మార్చి మహిళలకు విలువ ఇచ్చారు. (Image: Wikimedia Commons)
జీన్నే బారెట్... 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ నౌకాదళంలోకి మహిళల్ని అనుమతించేవారు కాదు. జీన్నే బారెట్ మాత్రం ప్రపంచాన్ని చుట్టి రావాలనుకుంది. బొటానిస్ట్ అయిన ఆమె... తన స్థనాలను (breasts) లైనెన్ బ్యాండేజీలతో చుట్టుకుంది. తద్వారా మగాడిగా చెప్పుకుంటూ... ప్రపంచాన్ని చుట్టింది. ఈ ప్రయాణంలో ఆమె బాయ్ ఫ్రెండ్ ఫిలిబెర్ట్ కామర్సెన్ ఆమెకు అసిస్టెంట్‌గా పనిచేశాడు. కానీ తాహితీ ప్రజలు ఆమె నిజస్వరూపాన్ని గుర్తించారు. ఆమెను చితకబాదారు. గ్యాంగ్ రేప్ చేశారు. కానీ ఆమె చేసిన ప్రయాణం ప్రపంచ గుర్తింపు తెచ్చింది. (Image: Wikimedia Commons)
ఖావ్లా బింట్ అల్ అజ్వార్... ప్రముఖ ముస్లిం అరబ్ యుద్ధనారి. ఖావ్లా మొదట్లో తన అన్నయ్యకు నర్సుగా ఉండేది. అతను రషిడన్ ఆర్మీలో కమాండర్. ముస్లిం దండయాత్రలో తన అన్నయ్యను బంధీ చేసినప్పుడు... ఆమె ఆయుధాలు ధరించింది. ముఖాని మూసేసుకొని... మగాళ్లతో కలిసి మగాడిలా యుద్ధం చేసింది. ఆర్మీలో జనరల్‌గా గుర్తింపు వచ్చాక... ఆమె తన ఫేస్‌పై ఉన్న ముసుగును తొలగించింది. ఆమె మహిళ అని తెలియడంతో ఆశ్చర్యపోయారంతా. కాలక్రమంలో బైజాంటీన్లు ఆమెను బంధించి... మహిళా జైలులో ఉంచారు. అక్కడామె మహిళా సైనికుల్ని తయారుచేసి... బైజాంటీన్లకు వ్యతిరేకంగా పోరాడేలా ధైర్యాన్ని్చ్చింది. (Image: Youtube/TheGr8virtue)
ఒకే కన్ను ఉన్న చార్లీ...... చార్లీ పర్ఖ్రుస్ట్... ఓ అమెరికా స్టేజ్ కోచ్ డ్రైవర్. తన జీవితమంతా మగాడి రూపంలో బతికింది. ఎప్పుడూ చూసినా ప్యాంట్స్లోనే కనిపించింది. గుర్రాల్ని కంట్రోల్ చేస్తూ వైల్డ్ వెస్ట్‌లో గుర్తింపు పొందింది. ఓసారి గుర్రంతో పోరాడుతూ ఓ కన్ను పోగొట్టుకుంది. అప్పటి నుంచీ ఆయుధాలు మోసే పని చేపట్టింది. పొగాకు నమిలే అలవాటు వల్ల నోటి క్యాన్సర్ వచ్చి చనిపోయేవరకూ ఆమె మహిళ అని ఎవరికీ తెలియదు. 1867లో అమెరికా ఎన్నికల్లో ఓటు వేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది.
రెనా కనోగోగీ రెనా... ప్రముఖ యూదు అమెరికా జ్యూడో నిపుణురాలు. 1950లో జూడో మాస్టర్ అయ్యింది. కానీ ఆమె మహిళగా పుట్టడమే ఆమెకు సమస్య అయ్యింది. మార్షల్ ఆర్ట్స్‌లో తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంది. అందుకోసం మగాడి డ్రెస్ వేసుకొని... 1959లో న్యూయార్క్ స్టేట్ YMCA జ్యూడో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. ఆ పోటీ మగాళ్లకు మాత్రమే. ఆ పోటీలో మగాళ్లందర్నీ ఓడించింది. జడ్జిలు ముందు మాత్రం తాను మహిళను అని నిజం చెప్పింది. ఆ పోటీలో ఆమె మెడల్ చేజార్చుకున్నా, మగాళ్ల కంటే మహిళలు ఏమాత్రం తీసిపోరని ఆమె నిరూపించింది. మహిళా జ్యూడో అవతరించేందుకు కారణమైంది. (Image: Facebook)
నోరా విన్సెంట్... జర్నలిస్టైన నోరా... మగాడిలా డ్రెస్ వేసుకుంది. మగాడి గొంతులో మాట్లాడేందుకు వాయిస్ లెసన్స్ తీసుకుంది. మగాళ్లతో స్నేహం చేసింది. ఎప్పుడు చూసినా మందపాటి ప్యాడ్స్ ఉన్న జాకెట్ వేసుకునేది. నెడ్ అనే పేరున్న బౌలింగ్ లీగ్‌లో పాల్గొంది. తను రాసిన "సెల్ఫ్ మేడ్ మ్యాన్ : మై ఇయర్ డిస్గస్డ్ యాజ్ ఏ మేన్" పుస్తకంలో నోరా... తన 18 నెలల అనుభవాల్ని తెలిపింది. చిత్రమేంటంటే... మగాడిలా కనిపించేందుకు ఆమె స్ట్రిప్ క్లబ్బులకు కూడా వెళ్లింది. మహిళలతో డేటింగ్ కూడా చేసింది.(Image: Wikipedia)