AstraZeneca Covid-19 vaccine study: ప్రపంచవ్యాప్తంగా కరోనాకి బెస్ట్ వ్యాక్సిన్ అని నమ్ముతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్త్రాజెనెకా ఫార్మా కంపెనీలు రూపొందించిన వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌ని అమెరికాలోని డజన్ల కొద్దీ టెస్టింగ్ సెంటర్లలో ఆపివేస్తున్నట్లు ఆస్త్రాజెనెకా కంపెనీ ప్రకటించింది. ఇందుకు ప్రధాన కారణం... బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ వ్యక్తికి... వ్యాక్సిన్ రియాక్షన్ ఇచ్చింది. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. "వ్యాక్సిన్ ఇచ్చి సమీక్షించే... ప్రామాణిక సమీక్షా ప్రక్రియకు బ్రేక్ పడింది." అని కంపెనీ తన స్టేట్మెంట్లో తెలిపినట్లు... ఆస్త్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. ఎందుకైనా మంచిదని ట్రయల్స్ తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు ఆస్త్రాజెనెకా తెలిపింది. ఇలాంటి వ్యతిరేక రియాక్షన్ ఎందుకు వచ్చిందో... అప్పుడే చెప్పలేమన్న ఫార్మా కంపెనీ... ఆ వ్యక్తి కోలుకుంటారని భావిస్తున్నట్లు చెప్పింది.
"ఈ ట్రయల్స్ నిలిపివేత అన్నది సహజంగా జరిగే ప్రక్రియే. ట్రయల్స్‌లో ఎవరికైనా తేడా వస్తే ఇలా చేస్తాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ట్రయల్స్‌పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే మేం నిలిపివేశాం. వ్యాక్సిన్ తయారీ ఆలస్యం కాకుండా ఉండేలా... ఇలా ఎందుకు జరిగిందో త్వరగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం" అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
ఇదేమీ చిన్న విషయం కాదంటున్నారు కొందరు నిపుణులు. ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రభావం... ఆస్త్రాజెనెకా వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అయ్యేందుకు కారణం కాగలదని అంటున్నారు. అంతేకాదు... ఇతర వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కూడా ఇలాంటి విషయాల్ని సీరియస్‌గా తీసుకోవాలంటున్నారు. ఇప్పటికే రష్యా... మొదటి దశ పూర్తవగానే... వ్యాక్సిన్ తయారైపోయినట్లు ప్రకటించింది. రెండో దశ నడుస్తుండగానే... వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి... పిల్లలకు ఇచ్చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం... మూడు దశల్లోనూ వ్యాక్సిన్ మంచిదని తేలితేనే... దాన్ని అందరికీ ఇవ్వాలంటోంది. మూడో దశలో... ట్రయల్స్ ఎక్కువ మందిపై జరుగుతాయి కాబట్టి... వ్యాక్సిన్ సరైనదని చెప్పేందుకు వీలవుతుందని అంటోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఈ కారణంగానే... మూడు దశలూ సంపూర్ణంగా పూర్తి చేశాకే... వ్యాక్సిన్ రిలీజ్ చెయ్యాలనుకుంటోంది. ఈలోగా... ఇలా జరిగింది.
ప్రస్తుతం ప్రపంచంలో 9 వ్యాక్సిన్లు మూడో దశ ట్రయల్స్ చేస్తున్నాయి. వాటిలో ట్రయల్స్ తాత్కాలికంగా ఆపేసిన తొలి కంపెనీగా ఆస్త్రాజెనెకా నిలిచింది. ఆస్త్రాజెనెకా మూడో దశ ట్రయల్స్‌ని అమెరికాలో... ఆగస్టులో ప్రారంభించింది. మొత్తం 90 చోట్ల ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. 30వేల మంది వీటిలో పాల్గొంటున్నారు. అంతకుముందు... రెండు, మూడో దశ ట్రయల్స్‌ని బ్రిటన్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలో చేపట్టింది కంపెనీ. మొదటి, రెండో దశల్లో... చాలా మందికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటివి వచ్చాయి. అవి చిన్నగానే వచ్చాయి. అది సహజమే అని తేల్చారు. ఇప్పుడు మాత్రం ఓ వ్యక్తికి కాస్త తీవ్రంగానే ఉండటంతో... అమెరికాలో ట్రయల్స్ నిలిపివేసింది ఆస్త్రాజెనెకా.