ఈ క్లోనింగ్ ప్రక్రియ గతేడాది మొదలైంది. చైనాలోని నార్త్ వెస్ట్ అగ్రికల్చరల్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్శిటీ సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. లింగ్వు నగరంలో.. పాలిచ్చే ఆవుల నుంచి కణజాలాన్ని సేకరించి IVF పద్ధతిలో బ్యాచ్ బ్రీడింగ్ టెక్నాలజీ వాడి.. ఈ క్లోనింగ్ ఆవులను సృష్టించారు. భవిష్యత్తులో ఈ క్లోనింగ్ ద్వారా మరిన్ని ఆవుల్ని సృష్టించి.. పాల ఉత్పత్తిని భారీగా పెంచుకొని.. పాల ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి చైనా బయటపడుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
సొమాటిక్ సెల్ టెక్నాలజీ ద్వారా క్లోనింగ్ చేసిన పిండాలను 120 ఆవుల్లో చేర్చారు. క్లోనింగ్ ఆవులు.. వందశాతం ఒకేలా ఉంటున్నాయి. ఏ ఆవు నుంచి సొమాటిక్ సెల్ సేకరించారో.. ఆ ఆవు లాగానే రంగు, లుక్ అంతా ఉంటోంది. క్లోనింగ్ కోసం వాడుతున్న పిండాల్లో 42 శాతం వరకూ సక్సెస్ అవుతున్నాయి. ప్రస్తుతం క్లోనింగ్ చేసిన పిండాలు 200 రోజుల నుంచి బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లోనింగ్ సక్సెస్ రేటు 17.5 శాతంగా ఉంది అని నార్త్ వెస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జిన్ యాపింగ్ తెలిపారు.
చైనాలో పాలు, పాల ఉత్పత్తుల వాడకం ఎక్కువ. చాలా వరకూ పాల ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సమస్యగా మారింది. ఈ క్లోనింగ్ ద్వారా దేశంలోనే పాల ఉత్పత్తిని భారీగా పెంచాలని చైనా భావిస్తోంది. క్లోనింగ్ ద్వారా వచ్చే ఆవు పూర్తిగా పెరిగిన తర్వాత రోజూ 15 లీటర్లకు పైగా పాలు ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ క్లోనింగ్ ఆవులు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాయా అనేది త్వరలో తెలుస్తుంది.