చిలీ అధ్యక్షుడిగా అత్యంత పిన్న వయస్కుడైన సోషల్ కన్వగెన్స్ పార్టీ నేత గాబ్రియేల్ బోరిక్ (35) ఎన్నికయ్యారు. మితవాద ప్రత్యర్ధి జోస్ ఆంటోనియా కాస్ట్‌పై వామపక్ష అభ్యర్థి గాబ్రియేల్ గెలుపొందారు. గాబ్రియేల్ సమర్థకుల్లో నూటికి నూరు శాతం యువతే కావడంతో విజయం తర్వాత వారి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి.
చిలీ ఎన్నికల ఫలితాలు (స్థానిక కాలమానం ప్రకారం) ఆదివారం వెలువడగా, లెఫ్టిస్టు యువ నేత గాబ్రియేల్ బోరిక్ కు 56 శాతం ఓట్లు, మితవాద ఆంటోనియాకు 44 ఓట్లు దక్కాయి. హోరాహోరీగా సాగిన పోరులో చివరికి యువ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ లా వామపక్ష అభ్యర్థికే పట్టం కట్టారు. త్వరలో బాధ్యతలు చేపట్టనున్న బోరిక్ చిలీ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన అధ్యక్షుడవుతారు.
పారిశ్రామికంగా లాటిన్ అమెరికాలో అందరికంటే మెరుగ్గా ఉన్న చిలీలో కార్మికులకు, సాధారణ ప్రజకు పెన్షన్, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సంస్కరించడం, వారానికి పని గంటలను 45 నుండి 40కి తగ్గించడం, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ పెంచడం ద్వారా అసమానతలను పరిష్కరిస్తామంటూ గాబ్రియెల్ బోరిక్ ఇచ్చిన హామీలను జనం విశ్వసించారు.
సహజ వనరులకు నిలయమైన చిలీ ఏళ్లకు ఏళ్లు నిరసనలతో చితికిపోయి..భవిష్యత్ తరాల కోసం కొత్త రాజ్యాంగాన్ని రచించేందుకు సిద్ధమౌతున్న వేళ యువ వామపక్ష నేత అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోనున్నారు. మాజీ విద్యార్థి నేత అయిన గాబ్రియేల్.. 2019-2020లో దేశంలో అసమానతలు, అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న సామూహిక ఆందోళనలకు మద్దతునిచ్చారు.