ఒకప్పుడు విమానయానం అంటే చాలా ఖరీదైన వ్యవహారం. కానీ ఇప్పుడు ప్రపంచంలోని నలుమూలలకు విమానాలు నడుస్తున్నాయి. కొండలు, గుట్టలు, బీచ్‌లు, మంచు పర్వతాలు, ద్వీపాల్లో కూడా విమానాశ్రయాలు కడుతున్నారు. అయితే అన్ని విమానాశ్రయాలు అంత సురక్షితమైనవి ఏమీ కావు. కొన్ని పైలెట్లకు పరీక్ష పెడుతూనే ఉంటాయి. కానీ ఆయా ప్రాంతాలను కలపడానికి సురక్షితం కాని ఎయిర్ పోర్టులను కూడా వినియోగిస్తుంటారు. అలా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌పోర్టులుగా పేరు తెచ్చుకున్న 10 విమానాశ్రయాలు ఏమిటో చూద్దాం. అందులో ఇండియాకు చెందిన విమానాశ్రయం కూడా ఒకటి ఉన్నది.
కాంగోనాస్ ఎయిర్పోర్ట్ (బ్రెజిల్): బ్రెజిల్లో ముఖ్యమైన నగరాల్లో ఒకటైన సావ్ పాలోలో ఉన్న ఎయిర్‌పోర్టునే కాంగొనాస్ ఎయిర్‌పోర్టు అని పిలిస్తారు. ఇక్కడ విమానాశ్రయంలోని రన్‌వే జారిపోతూ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎక్కువగా వర్షాలు పడే ఈ ప్రాంతంలో సరైన డ్రెయిన్ వ్యవస్థ లేకపోవడంతో రన్వేలు జారిపోతుంటాయి. ఈ మధ్యే కాస్త ఆధునీకరించినా.. రన్‌వేపై విమానాలు జారడం మాత్రం ఆగలేదు. అందుకే ప్రమాదకరమైన విమానాశ్రయాల జాబితాలో కాంగోనాస్కు చోటు లభించింది.
ప్రిన్సెన్ జులియానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (సెయింట్ మార్టిన్): పైన ఉన్న ఫొటోను చూస్తేనే అర్థమయ్యి ఉంటుంది.. ఈ ఎయిర్పోర్ట్ రన్‌వే ఎక్కడ కట్టారో. సముద్రం పక్కన బీచ్‌ను ఆనుకొనే ఈ ఎయిర్‌పోర్టు ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ కావడం అంటే పైలెట్లకు కత్తిమీద సాములా ఉంటుంది. ఒక్కోసారి బీచ్‌లోని వచ్చిన మనుషులపై నుంచి విమానాలు పోతుంటాయి.
కాయ్ తక్ ఎయిర్పోర్ట్ (హాంకాంగ్) : హాంకాంగ్‌లోని కాయ్ తక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తింపుపొందింది. ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్, టేకాఫ్ చేయడం చాలా కష్టం. చూట్టూ ఎత్తైన కొండల నడుమ ఎక్కడో లోయలో ఈ విమానాశ్రయం ఉంటుంది. కాగా, ఈ ఎయిర్‌పోర్టును 1998లో మూసేసి అక్కడి ప్రభుత్వం వేరే చోట కొత్తగా హంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నిర్మించింది.
బీరా ఎయిర్పోర్ట్ (స్కాట్లాండ్) : స్కాట్లాండ్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బిరా ద్వీపంలో ఉన్న ఎయిర్‌పోర్టునే బిరా ఎల్లోగేరి ఎయిర్పోర్ట్ లేదా ది బిరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారు. చాలా తక్కువ నిడివి ఉండే రన్‌వే ఉండటంతో దీనికి ఆనుకొని ఉన్న బీచ్‌ను కూడా రన్‌వేలా ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఒక బీచ్‌ను రన్‌వేలా ఉపయోగించే ఎయిర్పోర్ట్ ఇదొక్కటే. అంతే కాకుండా కొత్త పైలెట్ల కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అందుకే దీన్ని కూడా ప్రమాదకరమైన విమానాశ్రయాల జాబితాలో చేర్చారు.
టాంకైంటీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (హోండరూస్) : టాంకైంటీన్ అంతర్జాతీయ విమానాశ్రయం హోండరూస్ దేశంలో ఉంది. దీన్ని మిలటరీ కార్యాకలాపాలకే కాకుండా సాధారణ విమానాల కోసం కూడా ఉపయోగిస్తారు. అకస్మాత్తుగా మారిపోయే వాతావరణ పరిస్థితులు ఈ విమానాశ్రయానికి 'మోస్ట్ ఎక్స్ట్రీమ్ ఎయిర్పోర్ట్' అనే పేరు తెచ్చింది. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో భారీ విమానాలను సైతం దారి మళ్లించగలిగేంత వేగవంతమైన గాలులు వీస్తుంటాయి. అందుకే దీన్ని అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయం అని హిస్టరీ ఛానల్ జాబితాలోకి చేర్చారు.
లాక్లా ఎయిర్పోర్ట్ (నేపాల్) : నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లా ఖుంబులో ఈ లాక్లా ఎయిర్పోర్ట్ ఉంది. 2008లో దీనికి టెన్సింగ్ హిల్లరీ ఎయిర్‌పోర్టుగా పేరు మార్చారు. 8వేల అడుగుల ఎత్తులో హిమాలయాల్లో ఉండే ఈ విమానాశ్రయం గత 20 ఏళ్లుగా మోస్ట్ డేంజరస్ జాబితాలో ఉంది. ఈ విమానాశ్రయంలోని ల్యాండింగ్, టేకాఫ్ స్ట్రిప్స్ పొడవు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఈ ఎయిర్‌పోర్టులో విద్యుత్ ఉండే సమయం చాలా తక్కువ. ప్రపంచంలోని ఇతర ఎయిర్‌పోర్టుల్లో ఉండే అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ కూడా ఉండదు. దీంతో పైలెట్లు ముందు ఈ ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికే నానా తంటాలు పడాలి. ఎయిర్‌పోర్టు దగ్గరకు వెళ్లినా.. తమ సొంతంగా విమానాన్ని రన్‌వేపై దించాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతం తెలిసిన, అనుభవం ఉన్న పైలెట్లే ఎక్కువగా ఇక్కడ విమానాన్ని దించుతుంటారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చే పర్వతారోహకులే ఎక్కువగా ఈ విమానాశ్రయంలో దిగుతుంటారు.
వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (న్యూజీలాండ్) : వెల్లింగ్టన్ శివారులోని రాంగొటాయ్ ప్రాంతంలో నిర్మించిన వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రన్‌వే చాలా ప్రత్యేకమైనది. ఈ రన్‌వే మొదట్లో, చివర్లో నీటి కొలనులు ఉన్నాయి. 6,351 అడుగుల పొడవైన ఈ రన్‌వైపై విమానాన్ని ల్యాండింగ్, టేకాఫ్ చేసే సమయంలో పైలెట్ చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే విమానాలు ఆ కుంటల్లోకి దూసుకొని వెళ్లడం ఖాయం.
కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (జపాన్) : ఒసాకా బే సమీపంలో సముద్రం మధ్యలో కృత్రిమంగా నిర్మించిన దీవుల్లో కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. చుట్టూ నీళ్లు ఉండే ఈ విమానాశ్రయ రన్‌పై విమానాలను దించాలంటే ముందు పైలెట్ గుండె దిటవు చేసుకోవాల్సిందే. ఒసాకా విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి ఈ కాన్సాయ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ విమానాశ్రయానికి భూకంపాలు, తుఫాన్ల నుంచి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. అంతే కాకుండా గ్లోబల్ వార్మింగ్ కారణంగా రాబోయే నాలుగైదు దశాబ్దాల్లో సముద్ర నీటి మట్టాలు పెరిగితే ఈ విమానాశ్రయం ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొష్రొవెల్ ఎయిర్పోర్ట్ (ఫ్రాన్స్) : ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల నడుమ నిర్మించిన కొష్రొవెల్ ఎయిర్‌పోర్టు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. పర్వతాల్లో స్కీయింగ్ కోసం వెళ్లే వారికోసం నిర్మించిన ఈ విమానాశ్రయంలో రన్‌వే పొడవు కేవలం 537 మీటర్లే. పైగా ఈ రన్‌వే ఎగుడుదిగుడుగా ఉంటుంది. పైలెట్లు ఇక్కడ విమానాన్ని దింపాలంటే ముందు పర్వతాను దాటించి.. వాటిని ఢీకొట్టకుండా రన్‌వే దింపాల్సి ఉంటుంది. ఇది నిజంగా పైలెట్లకు కత్తిమీద సాములాంటిదే.