China Population : జనాభా అనేది.. రెండువైపులా పదునున్న అస్త్రం లాంటింది. ఏ దేశానికైనా జనాభాయే ప్లస్, మైనస్ అవ్వగలవు. ప్రస్తుతం ఇండియాకి యువ జనాభా ప్లస్ అయితే.. ఓవరాల్‌గా అధిక జనాభా మైనస్ అవుతోంది. అటు చైనాకి ఓవరాల్‌గా అధిక జనాభా మైనస్ అవ్వడమే కాదు.. ముసలివారి సంఖ్య పెరిగిపోవడం, యువత సంఖ్య తగ్గిపోవడం పెను సమస్య అవుతోంది. దీనిపై పూర్తి వివరాల్ని గ్రాఫిక్స్‌లో తెలుసుకుందాం.
పిల్లల సంఖ్య పెంచడానికి చైనా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నా.. ఫలితం దక్కట్లేదు. షెన్జెన్లో మూడో బిడ్డ పుడితే.. మూడేళ్లు వచ్చేలోపు ప్రభుత్వం 19000 యువాన్లు (రూ.1580) ఇస్తుంది. జినాన్‌లో రెండో లేదా మూడో బిడ్డను కనే తల్లులకు.. నెలకు 600 యువాన్లు (రూ.50) చొప్పున .. బిడ్డకు మూడేళ్లు వచ్చేవరకూ పొందుతారు.
యిచాంగ్లో రెండో, మూడో బిడ్డను కనే పేరెంట్స్. నెలకు 500 యువాన్లు (రూ.41) చొప్పున .. బిడ్డకు మూడేళ్లు వచ్చేవరకూ పొందగలరు. అలాగే పాంజీహ్వాలో కూడా ఒక బిడ్డ కంటే ఎక్కువ మందిని కనే కుటుంబాలకు నెలకు 500 యువాన్లు (రూ.41) చొప్పున మూడేళ్లపాటూ ఇస్తున్నారు. ఇంకా ఎన్నో చేస్తున్నా.. పిల్లల సంఖ్య పెరగట్లేదు.
2023లో భారత్.. చైనాను దాటేసి.. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిందని అంచనా. ఇది అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు. 1990లో చైనా జనాభా 114 కోట్లకు పైగా ఉండగా.. భారత్ జనాభా 86 కోట్లుగా ఉంది. 2022లో చైనా పాపులేషన్ 142.6 కోట్లు ఉండగా.. భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి చైనా జనాభా 131.7 కోట్లు ఉంటే.. భారత్ జనాభా 166.8 కోట్లు ఉంటుందని అంచనా.