రాజపాళయం: తమిళనాడులో ఘోరం జరిగింది. రాజపాళయంలో పట్టపగలు ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనలో రాజపాళయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. విరుధునగర్ జిల్లా రాజపాళయంలోని దురైస్వామిపురం వీధిలో గణేశన్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇంద్రాణి, గణేశన్ భార్యాభర్తలు. వీళ్లకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. గణేశన్‌కు ఓ కిరాణా దుకాణం ఉంది.
భార్యాభర్తలిద్దరూ ఆ షాప్ చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గణేశన్ కూరగాయలు తీసుకొచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లాడు. భర్త లేని సమయంలో దుకాణం చూసుకుంటుండే ఇంద్రాణి ఎప్పటిలానే దుకాణంలో కూర్చుని ఉంది. బయట తుంపరల మాదిరిగా చినుకులు పడుతున్నాయి. సమయం ఉదయం 11 గంటలు అవుతోంది. వర్షం పడుతూ ఉండటంతో రోడ్డుపై కూడా ఎవరూ పెద్దగా తిరగడం లేదు.
గణేశన్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి అక్కడి నుంచి భార్య ఇంద్రాణికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసి ఒక్కసారి తన భార్యకు ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఆ వ్యక్తి దుకాణానికి వెళ్లి చూడగా ఇంద్రాణి రక్తపుమడుగులో గొంతు కోసి ఉన్న స్థితిలో కనిపించింది. అది చూసిన పక్కింటి వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు.
ఇంద్రాణి గొంతు కోసిన స్థితిలో పడి ఉందని చెప్పడంతో గణేశన్ హుటాహుటిన మార్కెట్ నుంచి షాప్‌కు వచ్చి చూశాడు. అప్పటికే అతని భార్య తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు డీఎస్పీ రామకృష్ణన్‌తో సహా స్పాట్‌కు చేరుకున్నారు.
ఇంద్రాణికి పరిచయం ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై పగ పెంచుకుని పక్కా ప్లానింగ్‌తో ఆమెను హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. పట్టపగలు జరిగిన ఈ దారుణ హత్యతో రాజుపాళయం ఉలిక్కిపడింది. ఇంద్రాణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.