ఈ ఘటన కర్ణాటక.. బెంగళూరు.. నందినీ లేఅవుట్లో ఉన్న సంజయ్ గాంధీ నగర్ మురికివాడలో జరిగింది. వివాహిత అనిత (31) భర్త ఆంజనేయులు (35) ఆరు నెలల కిందట నిద్రలోనే చనిపోయాడు. తెల్లారే టీ ఇద్దామని భర్తను లేపగా.. లేవలేదు. చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వాళ్లు లేపి చూశారు. లేవలేదు. దాంతో చనిపోయాడని చెప్పడంతో.. అనిత గుండె పగిలేలా ఏడ్చింది. తనను, ఇద్దరు పిల్లల్నీ ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయాడని బావురుమంది. (ఫొటోలో ఆంజనేయులు, అనిత, రాకేష్)
కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులూ ఆమె ఓదార్చారు. గుండెపోటు (Heart attack)తో చనిపోయాడని భావించి.. అంత్యక్రియలు చేసేశారు. కొన్ని రోజులు అదే అద్దె ఇంట్లో ఉన్న అనిత.. భర్త లేని ఆ ఇంట్లో తాను ఉండలేకపోతున్నాననీ.. ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయనీ చెప్పి.. పిల్లలతో వేరే చోటికి వెళ్లిపోయింది. ఒంటరిగా జీవిస్తానని అందరికీ చెప్పింది. అందరూ అయ్యో పాపం అనుకున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
తాజాగా అనితకు తెలిసిన ఓ వ్యక్తి ఆమెను చూశారు. అప్పుడు అనిత మరో వ్యక్తితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఉంది. ఆమె భర్త చనిపోతే.. ఇతనెవరు అని డౌట్ వచ్చిన ఆ వ్యక్తి.. చనిపోయిన ఆంజనేయులు తాలూకు వారికి విషయం చెప్పారు. దాంతో ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఆమెను రహస్యంగా గమనించగా.. ఆమె మరో వ్యక్తితో ఉందనే విషయం తెలిసింది. (ప్రతీకాత్మకచిత్రం)
పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అనిత, ఆమెతో ఉన్న ఆమె ప్రియుడు రాకేష్‌ని అదుపులోకి తీసుకున్నారు. తమ స్టైల్లో ప్రశ్నించడంతో అనిత నిజం చెప్పేసింది. రాకేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె.. తన భర్త ఆంజనేయులును ఎలాగొలా వదిలించుకోవాలి అనుకుంది. ఓ రోజు అతను మద్యం తాగి వచ్చాడు. అతన్ని చంపడానికి అదే సరైన టైమ్ అనుకున్న ఆమె.. ప్రియుడికి కాల్ చేసింది. నక్కలా నక్కి నక్కి వచ్చిన ప్రియుడు.. దిండుతో నొక్కి చంపేద్దామన్నాడు. సరే అంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇద్దరూ కలిసి.. సైలెంటుగా ఆంజనేయులును లేపేశారు. మద్యం మత్తులోనే ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత రాకేష్ పిల్లిలా ఇంటి నుంచి జారుకున్నాడు. ఆ రాత్రి శవం దగ్గరే పడుకున్న అనిత.. తెల్లారే త్వరగా లేచి.. హైడ్రామా మొదలుపెట్టింది. అందర్నీ నమ్మించింది. కానీ నిజం, శవం ఎక్కువ కాలం దాగవు కదా. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇద్దర్నీ అరెస్టు చేశారు. ఇప్పుడు అనిత పిల్లల భవిష్యత్తు ప్రశ్నగా మారింది. ప్రియుడి మోజులో ఆమె చేసిన పని.. అన్ని విధాలా కష్టనష్టాలే మిగిల్చింది.