గుజరాత్... రాజ్‌కోట్ పోలీసులకు ఎప్పుడూ ఏదో ఒక కేసు తగులుతూనే ఉంటుంది. చాలా మంది సీక్రెట్‌గా లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. రోజుకో విధమైన దందా వెలుగులోకి వస్తోంది. ఎంత మందిని పట్టుకుంటున్నా... ఇంకా ఎక్కడో ఒక చోట కొత్త కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈమధ్యే... ఓ ఇంట్లో రష్యా వోడ్కాకి డూప్లికేట్ వోడ్కా తయారుచేస్తున్న ఓ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నారు. దానిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇంతలో మరో కేసు తగిలింది. అది కూడా అలాగే ఉంది.
స్థానిక లాల్పురిలో ఓ వ్యక్తి... దేశీయ లిక్కర్‌తో వాటర్ ప్యాకెట్లు తయారుచేస్తున్నాడు. పైకి వాటిపై వాటర్ ప్యాకెట్ అని పేరు ముద్ర ఉంటాయి. చూడ్డానికి కూడా అది నీరు లాగే ఉంటుంది. లోపల ఉండేది మాత్రం లిక్కర్. బ్రాండ్ పేరు రాయల్ వాటర్. ధర (డూప్లికేట్ ధర) రూ.1.25 అని ముద్రించారు. అది చూసి అందులో ఉన్నది లిక్కర్ అంటే పోలీసులు కూడా నమ్మలేకపోయారు. అంతలా అది వాటర్ ప్యాకెట్లా కనిపిస్తోంది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... ఈ క్రియేటివ్ పని చేస్తున్న వ్యక్తి పేరు రాజేష్ చగన్ భాయ్ మక్వానా. లాల్ పురి ఏరియాలో ఓ RMC ప్లాంట్, సులభ్ కాంప్లెక్స్ మధ్యలో ఉన్న ఇంట్లో నివసిస్తున్నాడు. భారీగా దేశీయ లిక్కర్ కొంటాడు. ఇంట్లో టీవీలో సినిమాలు చూస్తూ... చిన్న చిన్న వాటర్ ప్యాకెట్ల సైజులో... లిక్కర్ ప్యాకెట్లు తయారుచేస్తాడు. ఇందుకోసం 195 లీటర్ల లిక్కర్ కొని పెట్టుకున్నాడు. వాటి విలువ రూ.60,000గా అంచనా వేశారు. అలాగే 3,900 ఖాళీ కవర్ ప్యాకెట్లు రెడీగా ఉంచుకున్నాడు. ప్యాకెట్లకు సీల్ చెయ్యడానికి కావాల్సిన సరంజామా కూడా ఉంచుకున్నాడు. పోలీసులు ఇలాంటి మొత్తం రూ.6,900 సరంజామాను సీజ్ చేశారు.
పోలీసులు రాజేష్‌ని అరెస్టు చేసి... కేసు రాశారు. ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు ఎవరు చేసినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదివరకు కూడా ఇలాంటి చాలా హెచ్చరికలు చేస్తున్నా... కొత్త కొత్త నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పూర్వం ఇలాంటివే సారా ప్యాకెట్లు వచ్చేవి. ఆ తర్వాత వాటిపై నిషేధం అమలైంది. మళ్లీ అదే పద్ధతిని ఇప్పుడు అక్రమంగా అమలుచేస్తున్నాడు రాజేష్. ఇక ఇప్పుడు అతని జీవితం జైలుపాలే.