చిక్‌బళ్లాపూర్: కూతురి పెళ్లి చేస్తున్న సందర్భంగా అత్తింట్లో అమ్మాయి సుఖంగా ఉండాలని, ఏ కష్టం రాకుండా ఉండాలని తల్లిదండ్రులు ఇస్తున్న వరకట్నంపై కొందరు అల్లుళ్లకు ఆశ చావడం లేదు. తీసుకోవడం తప్పని తెలిసినా ఇచ్చింది పుచ్చుకుంటూనే మరింత తీసుకురావాలంటూ కొందరు భర్తలు భార్యలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, వాళ్లు ఇచ్చుకునే స్థితిలో లేరని చెప్పినా అర్థం చేసుకోకుండా భార్యలను వరకట్నం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ వరకట్న వేధింపులపై ఎన్ని కఠిన చట్టాలను తీసుకొచ్చిన కొందరు భర్తల బుద్ధి మారడం లేదు. ఫలితంగా అత్తింటి ఆరళ్లకు బంగారు తల్లులు బలవుతూనే ఉన్నారు. కొందరు ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు కూడా కోడళ్ల విషయంలో ఇలా ప్రవర్తిస్తుండటం శోచనీయం. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లాలో మూడు నెలల గర్భిణి వరకట్న వేధింపులకు బలైంది.
చిక్‌బళ్లాపూర్ జిల్లా బగేపల్లి తాలూకా కసాపూర్ గ్రామానికి చెందిన మధుకు, పవిత్ర(22)కు ఐదు నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం పవిత్ర 3 నెలల గర్భిణి. పెళ్లయిన కొత్తలో భార్యను బాగానే చూసుకున్న మధు తనకే ఆలోచన పుట్టిందో, చెప్పుడు మాటలకు ప్రభావితమయ్యాడో తెలియదు గానీ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు.
పవిత్ర కాస్త గట్టిగా మాట్లాడటంతో కోపం పెంచుకున్న మధు, అతని తల్లి కలిసి ఆమెను గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత.. ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కట్టుకథ అల్లారు. అయితే.. పవిత్ర తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధును, అతని తల్లిని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. మధు, అతని తల్లిపై వరకట్న వేధింపుల కేసుతో పాటు, హత్య కేసును పోలీసులు నమోదు చేశారు.