వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. పర స్త్రీ, పర పురుష వ్యామోహం చేటని రోజుకు ఎన్నో ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నా కొందరి తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. మార్పు రాకపోగా వావివరసలు మరిచి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ.. హత్యలకు పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్లోని భక్తియార్పూర్ పరిధిలో వెలుగుచూసింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆగస్ట్ 18న భక్తియార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘోపూర్ గ్రామంలో ధీరేంద్ర సింగ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతనిని కాల్చి చంపేశారు. ఎవరో తన భర్తను కాల్చి చంపేశారని అతని భార్య అంజలీ దేవి మొసలికన్నీరు కార్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు భార్య ప్రవర్తనపై అనుమానమొచ్చింది. ఆమెను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం వెలుగులోకొచ్చింది.
ధీరేంద్ర సింగ్ మేనల్లుడైన వికాస్ కుమార్తో అంజలీ దేవికి పరిచయం ఏర్పడింది. మేనల్లుడే కావడంతో ధీరేంద్ర కూడా అతనిని గానీ, భార్యను గానీ అనుమానించలేదు. భర్త తనపై పెట్టుకున్న ఆ నమ్మకాన్ని అలుసుగా తీసుకున్న అంజలీ దేవి.. వికాస్ కుమార్తో చనువుగా ఉండేది. మేనమామ భార్య అని తెలిసినా వికాస్ కూడా ఆమె మోజులోనే ఉండేవాడు. ఇద్దరి చనువు వివాహేతర సంబంధానికి దారితీసింది. పలుమార్లు ధీరేంద్ర సింగ్ కళ్లు గప్పి ఇద్దరూ శారీరకంగా కలిశారు. కొన్ని నెలల నుంచి ఇద్దరి మధ్య అఫైర్ ముదిరింది.
ధీరేంద్ర సింగ్ను అడ్డు తొలగించుకోవాలని అంజలీ దేవి, వికాస్ కుమార్ నిర్ణయించారు. అందుకు వికాస్ తన ముగ్గురు స్నేహితుల సాయం కోరాడు. రూ.50 వేలకు డీల్ మాట్లాడుకున్నాడు. తుపాకీ ఒకటి సంపాదించారు. ధీరేంద్ర సింగ్ పాల వ్యాపారం చేసేవాడు. అలా పాలు పోసి ఇంటికి వెళుతున్న ధీరేంద్రపై ఆగస్ట్ 16న వికాస్ స్నేహితులు కాల్పులు జరిపారు. అయితే.. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ధీరేంద్ర త్రుటిలో తప్పించుకున్నాడు. ప్లాన్ ఫెయిల్ కావడంతో ఇక ఇంట్లో ఉండగానే చంపాలని నిర్ణయించారు.
ఆగస్ట్ 18న ఇంట్లో నిద్రిస్తున్న ధీరేంద్రను వికాస్ కాల్చి చంపేశాడు. ఈ హత్యకు అంజలీ ప్లాన్ చేసింది. మొత్తానికి అనుకున్నట్టుగా ధీరేంద్రను మట్టుబెట్టిన అంజలి, వికాస్ ప్రస్తుతం అరెస్ట్ అయి పోలీసుల అదుపులో ఉన్నారు. ఆ మర్డర్ చేసిన తర్వాత తుపాకీని వికాస్ తన స్నేహితులకు ఇచ్చి భద్రపరచమని చెప్పాడు. వికాస్ స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురినీ మంగళవారం నాడు జైలుకు తరలించారు.