పాట్నా: బీహార్‌లో సంచలనం రేపిన జిమ్ ట్రైనర్ విక్రమ్ రాజ్‌పుత్‌పై హత్యాయత్నం కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ రాజీవ్ స్నేహితుడు వికాస్ తమతో మూడు లక్షలకు ఈ డీల్ కుదుర్చుకున్నట్లు విక్రమ్‌పై కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో బయటపెట్టారు. విక్రమ్ శరీరంలోకి ఐదు బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. అయినప్పటికీ అతను చనిపోకపోవడంతో డీల్ కుదుర్చుకున్న డబ్బుల్లో ఒక్క రూపాయిని కూడా తమకు ఇవ్వలేదని నిందితులు చెప్పారు.
ఈ ముగ్గురు నిందితులతో పాటు డాక్టర్ రాజీవ్‌ను, అతని భార్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. డాక్టర్ రాజీవ్ భార్య కుష్బూ జిమ్ ట్రైనర్ విక్రమ్‌పై మనసు పారేసుకుంది. భర్తకు తెలియకుండా విక్రమ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇద్దరూ కలిసి ఎంతో సన్నిహితంగా మెలిగారు. విక్రమ్ ఇంటికి కూడా కుష్బూ పలుమార్లు వెళ్లింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి నెల నుంచి ఇప్పటివరకూ కుష్బూ, విక్రమ్ మధ్య 1100 సార్లు ఫోన్ కాల్స్ నడిచాయి. అన్నీ అర్ధరాత్రి సమయంలో మాట్లాడుకున్న సంభాషణలే కావడం గమనార్హం. కాల్ చేసిన ప్రతిసారి ఇద్దరూ 30 నుంచి 40 నిమిషాలు మాట్లాడుకునేవారు. అయితే.. ఏప్రిల్ 18న తొలిసారిగా విక్రమ్ నంబర్‌కు కుష్బూ భర్త డాక్టర్ రాజీవ్ నుంచి కాల్ వెళ్లింది. చంపేస్తానని ఫోన్లో విక్రమ్‌ను రాజీవ్ బెదిరించాడు.
ఈ క్రమంలోనే.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విక్రమ్‌పై కాల్పులకు తెగబడ్డారు. కదంకౌన్ ప్రాంతంలో విక్రమ్‌పై కాల్పులు జరిపిన అగంతకులు 5 బుల్లెట్లను విక్రమ్ శరీరంలోకి దించారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్కూటీపై విక్రమ్ జిమ్ సెంటర్‌కు వెళుతుండగా కదమ్కౌన్ ప్రాంతంలోని బుద్ధ విగ్రహం సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. విక్రమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
డాక్టర్ రాజీవ్, అతని భార్య కుష్బూ తనను చంపించడానికి కుట్ర పన్నారని విక్రమ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే.. పోలీసుల విచారణలో మాత్రం డాక్టర్ రాజీవ్, అతని భార్య కుష్బూ సంబంధం లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. తమకు విక్రమ్ ఎవరో తెలియదన్నట్టుగా మాట్లాడారు. కానీ.. కాల్ డేటా ఈ దంపతుల కుట్రను బట్టబయలు చేసింది. డాక్టర్ రాజీవ్ అధికార జేడీయూ నేత కూడా కావడం గమనార్హం.