మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీకి చెందిన 57ఏళ్ల ఉమాదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగలపై ఆశతో ఆలయ అర్చకుడే ఈ దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు. ప్రధాన నిందితుడు అనుముల మురళీ కృష్ణ అలియాస్ కిట్టూ(40), నగల వ్యాపారి జోషి నందకిషోర్(45)ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి దొంగిలించిన ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందో మల్కాజ్ గిరి డీసీపీ రక్షిత మీడియాకు వివరించారు. సోమవారం సాయంత్రం ఆలయానికి వెళ్లిన తన భార్య ఇంటికి తిరిగిరాలేదంటూ విష్ణుపురి కాలనీకి చెందిన జీవీఎన్ మూర్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు ఉమాదేవి కోసం గాలిస్తుండగా, గురువారం ఉదయం కాలనీ సమీపంలోని దేవాలయం వెనుక మృతదేహం కనిపించింది. ఒంటిపై నగలు లేకపోవడంతో ఆభరణాల కోసమే హత్య చేసినట్టుగా పోలీసులు భావించి ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలోని స్వయం భూ సిద్ది వినాయకస్వామి దేవాలయం అర్చకుడు మురళీకృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన మురళీకృష్ణ బతుకు దెరువు కోసం మల్కాజిగిరి వచ్చి సిద్ది వినాయక ఆలయంలో నాలుగేళ్లుగా అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటోన్న ఉమాదేవి రోజూ ఆలయానికి వచ్చేది. గుడికి వచ్చేటప్పుడు నగలు పెట్టుకోవడం ఆమెకు అలవాటు. విలాసాలకు అలవాటుపడి, అప్పులు చేసి ఇబ్బందుల్లో ఇరుక్కున్న అర్చకుడు మురళీకృష్ణ ఆమె నగలు కాజేయాలనుకున్నాడు.
ఉమాదేవి చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఒంటిపై నగలన్నీ తీసుకున్నాడు. మృతదేహాన్ని ఆలయంలోనే విగ్రహం పక్కనే ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి మూతపెట్టాడు. రక్తపు మరకలు కనబడకుండా నీటితో కడిగాడు. అదేరోజు రాత్రి తనకు తెలిసిన బంగారు దుకాణంలో నగలు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. తర్వాత, ఆలయంలోని మృతదేహం నుంచి దుర్వాసన రావటంతో నిందితుడు అప్రమత్తమయ్యాడు.
సోమవారం ఉమాదేవిని హత్య చేసి శవాన్ని డ్రమ్ములో దాచిన అర్చకుడు మురళికృష్ణ.. రెండు రోజుల తర్వాత, అంటే బుధవారం రాత్రికి దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని ఆలయ వెనుక భాగంలో చెట్ల మధ్యన పడేశాడు. ఆ తర్వాత డ్రమ్ము, ఆలయాన్ని మరోసారి శుభ్రం చేసి దూపం వేశాడు. ఆలయం వద్ద సీసీటీవీ ఫులేజీలు పనిచేయకపోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా మారింది.
మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏసీపీ శ్యాంప్రసాద్, ఇన్స్పెక్టర్లు జగదీశ్వర్‌రావు, ఎ.సుధాకర్ బృందం.. ఉమాదేవి వెళ్లినట్లు అనుమానం ఉన్న చుట్టు పక్కల సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఉమాదేవి ఆలయానికి వచ్చి వెనక్కి వెళ్లలేదని, ఆమె పాదరక్షలు ఆలయంలోనే వదలి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.
ఉమాదేవి ఆలయంలోనే అదృశ్యం అయినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. అర్చకుడి కదలికలపై నిఘా ఉంచారు. అనుమానాలు నిర్ధారణ కావడంతో అర్చకుణ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా, తానే హత్య చేసినట్టు మురళీకృష్ణ అంగీకరించాడు. అర్చకుడు మురళీకృష్ణతోపాటు దొంగ బంగారం కొన్న జువెలరీ షాపు యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
మల్కాజ్ గిరి ఆలయంలో హత్య కేసును ఛేదించటంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్వోటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్లు జగదీశ్వర్‌రావు, సుధాకర్‌లను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని శ్మశానవాటిలో శుక్రవారం ఉమాదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఉమాదేవి కుటుంబీకులను పరామర్శించారు.