వారం రోజులుగా పరారీలో ఉన్న వికాశ్ దూబెను మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ మహంకాళి ఆలయం వద్ద గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి కన్పుర్కు తరలిస్తున్న సమయంలో కన్పుర్ శివారులో ప్రమాదవశాత్తు అతను ప్రయాణిస్తున్న వాహనం పల్టీకొట్టింది. తమ దగ్గరున్న పిస్తోలు తీసుకుని కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో వికాశ్ దూబె చనిపోయినట్లు పోలీసు అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు కూడా గాయపడినట్లు తెలిపారు.
పోలీసుల వాదనలు ఎలా ఉన్నా...ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటర్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికాశ్ దూబెను తరలిస్తున్న పోలీసుల కాన్వాయ్కి వెనుక వస్తున్న మీడియా వాహనాలను ఎన్కౌంటర్కు ఐదు నిమిషాల ముందే నిలిపివేశారు. ఉజ్జయిన్ నుంచి దూబె బయలుదేరిన వాహనం ఒకటికాగా...ప్రమాదంలో పల్టీకొట్టిన వాహనం మరొకటి. అలాగే కరుడుగట్టిన నేరగాడైన దూబెకి సంకెళ్లు ఎందుకు వెయ్యలేదని ప్రశ్నిస్తున్నారు.
కాగా ఈ ఎన్కౌంటర్ ఘటనపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్కౌంటర్ నమ్మశక్యంగా లేదన్నారు. బాలీవుడ్లో జరిగిన సన్నివేశాలు నమ్మశక్యంగా లేవని అందరూ అంటుంటారు...మరి వాళ్లు ఇప్పుడేమంటారు? అంటూ తాప్సీ ప్రశ్నించింది. తద్వారా వికాశ్ దూబె ఎన్కౌంటర్పై ఆమె అనుమానాలు వ్యక్తంచేశారు. తాప్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.