అర్థరాత్రి నగల షాపుకి వచ్చిన దొంగ... వెనకవైపు గోడకి కన్నం పెట్టాడు. ఆ కన్నం ద్వారా షాపులోకి వెళ్లి... లక్షల రూపాయల నగలు పట్టుకుపోయాడు. వివరాలు చూస్తే... గుప్తానగర్ రోడ్డులో ఉంది చాముండి జ్యువెలర్స్ షాపు. ఈ షాపులో 6 కేజీల వెండి నగలను చోరీ చేసి పట్టుకుపోయాడో దొంగ. అలాగే DVR (Digital Video Recorder) కూడా పట్టుకుపోయాడు. తద్వారా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్ కూడా అతను పట్టుకుపోయినట్లైంది. విచిత్రమేంటంటే... గోడకు కన్నం పెట్టిమరీ షాపులోకి వచ్చిన దొంగ... డ్రాయర్లలోని వెండి నగలను దోచుకున్నాడే తప్ప... అద్దాల డిస్ప్లేలలో ఉన్న బంగారు నగలను టచ్ చెయ్యలేదు. అద్దాలు పగలగొట్టి చోరీ చేసే అవకాశం ఉన్నా... అతను అలా ఎందుకు చెయ్యలేదో పోలీసులకే అర్థం కాలేదు.
ఇంతకు ముందు కూడా ఇలాంటి చోరీలు 2 జరిగాయి. ఓ వంటపాత్రల షాపులోకి ఎంటరైన దొంగ... ఆ సమయంలో కరెంటు లేకపోవడాన్ని గుర్తించాడు. వెంటనే... కాగితాలు పోగేసి... షాపులోనే మంటపెట్టాడు. ఆ కాంతిలో.. అంతా వెతికి... రూ.1500 క్యాష్ పట్టుకుపోయాడు. ఆ తర్వాత... పక్కనే ఉన్న ఓ నగల వ్యాపారి ఇంటికి వెళ్లాడు. పైకప్పుకి కన్నం పెట్టాడు. అప్పుడు కూడా వెండి నగలే పట్టుకుపోయాడు.
అంతకు ముందు జరిగిన 2 చోరీలకూ... ఈ తాజా దొంగతనానికీ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుండటంతో... ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోడకు పెట్టిన కన్నం చిన్నగా ఉంది కాబట్టి... యువకుడైన దొంగ, సన్నగా ఉన్న దొంగ ఈ చోరీలు చేస్తూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ దొంగతోపాటూ... ఇంకా అతనికి ఎవరైనా తోడుగా వస్తున్నారా అనేది కూడా ఆలోచిస్తున్నారు.