భిల్వారా: రాజస్థాన్లో భిల్వారా జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని మండల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. భర్త ఫోన్లో మరో మహిళతో అతను కలిసి ఉన్న ఫొటోను చూసిన భార్య అతనిపై పగ పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పింకి కన్వర్ అనే మహిళ, దేవి సింగ్ అనే వ్యక్తి భార్యాభర్తలు.
దేవి సింగ్ రోజువారీ కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్యాభర్తలు పెళ్లయిన కొన్నేళ్లు బాగానే ఉన్నారు. ఉన్నంతలో సుఖంగా ఉంటూ, తింటూ కాపురాన్ని సాఫీగా సాగించారు. కానీ.. ఇటీవల దేవి సింగ్ ఫోన్లోని ఓ ఫొటో ఈ కాపురంలో చిచ్చు రేగడానికి కారణమైంది. భర్త ఫోన్ను చెక్ చేసిన పింకికి ఓ ఫొటో కనిపించింది. ఆ ఫొటోలో ఓ మహిళ తన భర్తతో చనువుగా ఉండి సెల్పీ దిగడాన్ని చూసిన పింకి కోపంతో రగిలిపోయింది.
ఆ మహిళ తన భర్త పనిచేసే దగ్గర పనిచేస్తుందని తెలుసుకుంది. ఎన్నాళ్ల నుంచి ఆమెతో చనువుగా ఉంటున్నావంటూ భర్తను పింకి నిలదీసింది. ఈ ఫొటో విషయంలో భార్యాభర్తల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా భర్తపై పగ పెంచుకున్న పింకి అతనిని చంపాలని నిర్ణయించుకుంది. తన భర్తను చంపేందుకు పింకి.. ఆమె సోదరి అల్లుడైన కుల్దీప్ సింగ్ సాయం కోరింది.
కుల్దీప్కు మొదటి నుంచి నేర చరిత కలిగిన వ్యక్తి. దీంతో.. అతనికి ఎవరూ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలో పింకి తన మేనకోడలితో కుల్దీప్కు పెళ్లి జరిపించింది. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడొచ్చిందని భావించిన కుల్దీప్.. పింకి చెప్పినట్టే ఆమె భర్త హత్యకు ప్లాన్ చేశాడు. తన ఇద్దరు స్నేహితులు, కుల్దీప్, పింకి కలిసి దేవి సింగ్ను అనుకున్నట్టుగానే చంపేశారు. పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించి పింకిని, కుల్దీప్ను అరెస్ట్ చేశారు.