కర్ణాటక.. బెంగళూరులో ఓ తల్లి కుక్క కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఓ ఆఫీసర్... కుక్క పిల్లల నుంచి తల్లి కుక్కను వేరు చేయడంతో అక్కడి జంతు రక్షణ ప్రేమికులు కన్నెర్ర జేశారు. ఆ వేరు చేసిన వ్యక్తి ఎవరో కాదు... పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్బాస్. ఆయనపైనే గుర్రుగా ఉన్నారు జంతు రక్షణ ప్రేమికులు.
బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పోలీసులకు అక్కడి స్మిత ఉత్తమ్ తల్లిమణి కంప్లైంట్ ఇవ్వడంతో... పోలీసులు మార్చి 17న కేసు రాశారు. మార్చి 14న అబ్బాస్.. మూడు కుక్కపిల్లల నుంచి తల్లి కుక్కను వేరు చేసి పట్టుకుపోయారని స్మిత కంప్లైంట్ చేశారు. అబ్బాస్‌ని పోలీస్‌స్టేషన్‌కి పిలిచి.. దీనిపై ఎంక్వైరీ చెయ్యాలని కోరారు. గుర్తించదగని నేరంగా పోలీసులు ఈ కేసు రాశారు.
దీనిపై పోలీసులు అబ్బాస్‌ని ప్రశ్నించారు. "ఆ తల్లి కుక్కను నేను ఒంటరిగా ఉంచాను. దానిపై స్థానికుల్లో ఒకరు నాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కుక్క ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ లాట్ దగ్గర 7 పిల్లలకు జన్మనిచ్చింది. వాటిలో 4 పప్పీలను స్థానికులు దత్తతకు తీసుకున్నారు. వాటి కోసం ఆ తల్లి కుక్క వెతుక్కుంటోంది" అని అబ్బాస్ తెలిపాడు.
"అపార్ట్మెంట్ లోని ఓ వ్యక్తి తన వెహికిల్ కోసం పార్కింగ్ లాట్ లోకి వెళ్లగా.. తన పిల్లల్ని ఎత్తుకుపోయేందుకు వచ్చాడనుకున్న తల్లి కుక్క అతని వెంట పడింది. అతని కంప్లైంట్ ఆధారంగా తల్లి కుక్కను ఒంటరిగా ఉంచి.. పరిశీలిస్తున్నాను" అని అబ్బాస్ తెలిపాడు. ఆ తల్లి కుక్కను తిరిగి అదే ప్రదేశంలో విడిచిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తానని అబ్బాస్ తెలిపాడు.
జంతు రక్షకులు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. స్మిత.. మార్చి 2న కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తన అపార్ట్మెంట్కి అరకిలోమీటర్ దూరంలో ఎవరో కుక్కపిల్లను కాలువలో పడేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఐతే.. ఆపార్ట్మెంట్ మేనేజ్మెంట్ మాత్రం.. సీసీటీవీ ఫుటేజ్ చూపించేందుకు నిరాకరించింది. ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల్ని పరిష్కరించేందుకే టైమ్ చాలక ఇబ్బంది పడుతున్న పోలీసులకు.. ఈ కుక్కల కేసులు తలనొప్పిగా మారుతున్నాయి. అయినప్పటికీ.. తమ వంతుగా ఈ కేసుల్ని కూడా పరిష్కరిస్తున్నారు.