వీళ్లిద్దరూ ప్రాణ స్నేహితులనే విషయం కలిసి చనిపోయేదాకా తమకు తెలీదని తల్లిదండ్రులు అంటున్నారు. ఇంట్లోవాళ్లకు తెలిసినంత వరకు ఇద్దరికీ కుటుంబాల పరంగా ఎలాంటి సమస్యలు లేవు. చదువుల్లోనూ రాణిస్తున్నారు. లవ్ అఫైర్లు గట్రా కూడా లేవు. మరి కడపకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరైనా వీళ్లను భయపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాడికి మండలం కమలపాడు గ్రామానికి చెందిన కల్యాణి (18) గుత్తిలోని గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఈసీఈ చదువుతోంది. ఈమె తండ్రి రామాంజనేయులు యాడికిలో కూల్డ్రింక్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యాడికి పట్టణంలోని హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రిలోని సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది.
వీరిద్దరూ వేములపాడు మోడల్ స్కూలులో ఇంటర్ వరకు కలిసి చదివారు. జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి పని ఉదంటూ కల్యాణి తాడిపత్రి నుంచి సొంత ఊరైన యాడికి మండలం కమలపాడు గ్రామ సచివాలయానికి వెళుతున్నానంటూ మొన్న సోమవారం ఇంట్లో నుంచి బయలుదేరింది. పూజితనేమో కాలేజీకి వెళుతున్నానంటూ బయటికొచ్చింది. వీళ్లిద్దరూ సోమవారం ఉదయం 9.45కు తాడిపత్రిలో కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కి కడపలో దిగారు..
కడప బస్టాండ్ లో దిగిన తర్వాత ఇద్దరూ సంతోషంగా సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 1.30 సమయంలో కడప రైల్వే స్టేషన్ లో సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా వెల్లడైంది. రాజంపేట వైపు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా, అక్కడ పని చేస్తోన్న సిబ్బంది ఇటు రాకూడదని చెప్పడంలో వాళ్లు మళ్లీ రోడ్డు మీదికొచ్చి ఆటోలో భాకరాపేట (ఎర్రముక్కపల్లె) రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లారు.
ఇద్దరూ పట్టాలపై నడుచుకుంటూ వస్తుండటాన్ని చూసి గూడ్స్ రైలు డ్రైవర్ వేగాన్ని తగ్గించాడు. దీంతో వారు పట్టాలు దిగారు. కానీ రైలు దగ్గరికి రాగానే అమాంతం ఇద్దరూ ఒక్కసారే పట్టాలపై పడ్డారు. రైలు ఢీకొట్టడంతో కల్యాణి స్పాట్ లోనే చనిపోయింది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ పూజిత కూడా కాసేపటికే మృతి చెందింది.
బిడ్డల మృతదేహాలు చూసి రెండు కుటుంబాల వారు బోరున విలపించారు. అసలీ మరణాలకు దారి తీసిన పరిస్థితులు ఆద్యంతం మిస్టరీగా ఉన్నాయి. సొంతూరికి వెళతానన్న కల్యాణి, కాలేజీకి పోతానన్న పూజితలు కడపకు ఎందుకొచ్చారో అర్థం కావట్లేదని, అసలు వీళ్లిద్దరూ స్నేహితులనే విషయం తామెవరికీ తెలీదని ఇరు కుటుంబాలవాళ్లు చెబుతున్నారు. అమ్మాయిలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే మిస్టరీని ఛేదిస్తామని సివిల్ పోలీసులు చెబుతున్నారు. రైల్వే పోలీసులు సైతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.