నవంబర్ 29, 2015న శక్తివేల్, శరణ్య వివాహం జరిగింది. ఈ జంటకు ఆరేళ్ల వయసున్న కనిష్క అనే కూతురు, మూడేళ్ల వయసున్న పువిష అనే కూతురు ఉన్నారు. శక్తివేల్ టెక్స్టైల్ వర్కర్. ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలో కొన్ని నెలలుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. మానసిక సమస్య బారిన పడిన శరణ్య తాను ఒంటరిగా ఉంటానని, ఎక్కడికైనా వెళ్లిపోతానని భర్తతో చెప్పేది. భార్య ప్రవర్తనపై శక్తివేల్ కోపగించుకునేవాడు.
శరణ్యకు ఉన్న మానసిక సమస్య కారణంగా భార్యాభర్తలిద్దరూ చీటికీమాటికీ గొడవ పడుతుండేవారు. పిల్లలు తల్లిదండ్రులు గొడవ పడుతుండటం చూసి ఏడుస్తుండేవారు. కన్నబిడ్డలను చూసి కూడా శరణ్య, శక్తివేల్ మారలేదు. ఏదో ఒక విషయంలో ప్రతి నిత్యం గొడవ పడుతూనే ఉండేవారు. భర్తతో గొడవల కారణంగా కొన్ని రోజులుగా శరణ్య మరింత మానసిక ఒత్తిడికి లోనైంది.
ఏడుస్తూ బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే.. మానసిక స్థితి సరిగా లేని శరణ్య తొందరపాటు నిర్ణయం తీసుకుంది. భర్త గాఢ నిద్రలో ఉండగా ఎవరి కంటా పడకుండా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇద్దరు పిల్లల్లో ఒక పాపను తీసుకుని 100 అడుగుల లోతైన బావి వద్దకు వెళ్లింది. ఆ పాపను ఆ బావిలో పడేసింది. ఆ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లింది. నిద్రపోతున్న మరో పాపను లేపి బావి దగ్గరకు తీసుకెళ్లింది. ఆ పాపనూ బావిలోకి తోసింది. ఆ తర్వాత తనూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఒకానొక సమయానికి ఆమె భర్తకు మెలకువ వచ్చి చూసేసరికి ఇంట్లో భార్యాపిల్లలు కనిపించలేదు. దీంతో.. కంగారు పడి అంతటా వెతికాడు.
ఇరుగుపొరుగు వారు కూడా శరణ్య, పిల్లల కోసం వెతుకులాట సాగించారు. చివరకు బావిలో ముగ్గురి శవాలను చూసి శక్తివేల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎంతపనిచేశావంటూ భార్యను తలచుకుని బాధపడ్డాడు. కన్న బిడ్డలను తలచుకుని గుండెలవిసేలా రోదించాడు. బావి బాగా లోతుగా ఉండటంతో దిండిగుల్ జిల్లా అధికారులు కుజిల్యంపర ఫైర్ డిపార్ట్మెంట్కు ఘటన గురించి సమాచారం అందించారు. ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం కరూర్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు.
పలవీడు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం గురించి భర్త వేధింపులకు గురిచేశాడేమోనన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. శరణ్య మానసిక స్థితి కొన్నాళ్లుగా సరిగా లేదని ప్రాథమిక విచారణలో తేలింది. తల్లీ, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటనతో ఆ గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇలా శరణ్య జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.