బెంగళూరులోని రామమూర్తి నగర్లో 32 ఏళ్ల వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించిన ఘటన కలకలం రేపింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించారని.. అన్యాయంగా తమ కూతురిని పొట్టనపెట్టుకున్నారని ఆ మహిళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని మునెరెడ్డి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో మిథున్‌రెడ్డి, అతని భార్య శ్రుతి(32) నివాసముంటున్నారు.
వీరిద్దరికీ 2014లో పెద్దల సమక్షంలో వివాహమైంది. భారీగా కట్నం ఇఛ్చి శ్రుతి తల్లిదండ్రులు కూతురి పెళ్లి జరిపించారు. పెళ్లయిన కొన్నాళ్లు మిథున్ కూడా భార్యతో ఎంతో ప్రేమగా మెలిగేవాడు. ఆమెతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. కానీ.. గత కొంత కాలంగా మిథున్ రెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అదనపు కట్నం కోసం భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అతనికి తోడు అదే ఇంట్లో ఉండే మిథున్ తల్లి భాగ్యమ్మ కూడా కోడలిని అదనపు కట్నం కోసం వేధించసాగేది.
గత శుక్రవారం.. తనకు లక్ష రూపాయలు కావాలని.. పుట్టింటికి వెళ్లి తీసుకురావాలని భార్యను మిథున్‌రెడ్డి అడిగాడు. తమ వాళ్లు కష్టపడి లక్షల కట్నమిచ్చి మరీ తన పెళ్లి చేశారని.. పదేపదే వాళ్ల దగ్గర మాత్రం ఎక్కడ ఉంటాయని శ్రుతి భర్తను ప్రశ్నించింది. అదంతా తనకు తెలియదని.. తనకు లక్ష రూపాయలు కావాల్సిందేనని మిథున్‌రెడ్డి పట్టుబట్టాడు. ఇదే విషయాన్ని పుట్టింటికి ఫోన్లో చెప్పి శ్రుతి బాధపడింది.
అదనపు కట్నం కోసం తనను తల్లీకొడుకు కలిసి వేధిస్తున్నారని.. డబ్బు మనుషులన్న విషయాన్ని పెళ్లికి ముందు గుర్తించలేకపోయామని శ్రుతి తల్లికి చెప్పుకుని కంటతడి పెట్టుకుంది. ఈ పరిణామాలతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందో లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారో తెలియదు గానీ సోమవారం ఉదయం మెట్టినింట్లో శ్రుతి విగత జీవిగా పడి ఉంది.
కూతురు చనిపోయిన విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తమ కూతురిని చంపేశారని గుండెలవిసేలా రోదించారు. తన అల్లుడు, అతని తల్లే తమ కూతురి చావుకు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రుతి భర్త మిథున్‌రెడ్డిని, అతని తల్లి భాగ్యమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.