రోహ్తక్: హర్యానాలోని రోహ్తక్లో ఆగస్ట్ 27న జరిగిన ఒకే కుటుంబంలో నలుగురి హత్యలకు సంబంధించి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కన్న తల్లిదండ్రులను, సోదరిని, నానమ్మను అతి కిరాతకంగా హత్య చేసిన అభిషేక్ అలియాస్ మోనూ ఈ హత్యలు చేయడం వెనకున్న అసలు కారణం తాజాగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అభిషేక్‌కు కార్తీక్ అనే స్నేహితుడు ఉన్నాడు. అభిషేక్, కార్తీక్ బంధం స్నేహంతోనే ఆగిపోలేదు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసుండాలనుకున్నారు. అందుకోసం.. అభిషేక్ అమ్మాయిగా మారిపోవాలనుకున్నాడు. అందుకోసం.. ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు. అయితే.. లింగ మార్పిడి ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి తండ్రిని డబ్బులడిగాడు.
తాను అమ్మాయిగా మారిపోవాలనుకుంటున్నానని, అమ్మాయిగా మారిపోయి కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. ఆపరేషన్ చేయించుకునేందుకు డబ్బులివ్వాలని తండ్రి బబ్లూ పెహల్వాన్‌ను అడిగాడు. కొడుకు డబ్బులు అడిగిన కారణం విని విస్తుపోయిన బబ్లూ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. తల్లి, సోదరి, నానమ్మ కూడా అభిషేక్‌ను తప్పుబట్టారు. ఈ పరిణామంతో అభిషేక్ రగిలిపోయాడు. తండ్రి బబ్లూను, తల్లి బబ్లీని, సోదరి నేహాను, నానమ్మ రోషిణిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే.. ఆగస్ట్ 27న నలుగురిని కాల్చి చంపేశాడు. ఏమీ తెలియనట్టు గుర్తు తెలియని వ్యక్తులెవరో కాల్చి చంపేశారని పోలీసులకు చెప్పాడు.
ఖాకీలకు అభిషేక్‌పై అనుమానమొచ్చింది. ఐదు రోజులు రిమాండ్‌లోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం కక్కాడు. ఆ నలుగురిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. కానీ.. ఎందుకు చంపావనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు. ఎట్టకేలకు తాజాగా కారణం బయటపెట్టాడు. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకునేందుకు తన ఫ్యామిలీ డబ్బులివ్వలేదని.. అందుకే అందరినీ చంపేశానని చెప్పాడు. అభిషేక్ చెప్పిన కారణం విని పోలీసులు షాకయ్యారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు అభిషేక్ ఇంట్లో పై అంతస్తులో ఉన్న తన రూమ్‌లోకి వెళ్లాడు. నేరుగా పక్కనే ఉన్న తన సోదరి నేహా(19) రూంకు వెళ్లాడు. ఆ సమయంలో నిద్రపోతున్న నేహాను దగ్గరకు వెళ్లి సరాసరి నుదిటిపై తుపాకీ పెట్టి కాల్చేశాడు. ఆమెను కాల్చిన సమయంలో చివరి క్షణాల్లో నేహా.. అదే సమయంలో ఏదో పని గురించి పైకొచ్చిన తన నానమ్మ రోషిణిని పిలిచే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో నానమ్మకు అనుమానం రాకుండా నేహాకు బెడ్‌షీట్ కప్పి అభిషేక్ కనిపించకుండా నక్కాడు. మనవరాలిని చూసిన రోషిణి నిద్రపోతుందని భావించింది.
నేహా రూం నుంచి బయటకు వెళ్లాక నానమ్మ తలలోకి అభిషేక్ బుల్లెట్ దించాడు. ఆమె ఒక్కసారిగా ఫ్లోర్‌పై కుప్పకూలి పడిపోయింది. ఆమె అప్పటికీ కదులుతుండటంతో ప్రాణాలతో ఉందేమోనన్న అనుమానంతో మరో బుల్లెట్‌ను ఆమెపై కాల్చాడు. ఆ తర్వాత నానమ్మ తన రూంలో ఉందని.. నిన్ను కూడా రమ్మంటుందని అభిషేక్ తన తల్లి బబ్లీకి కాల్ చేశాడు. కొడుకు పిలిచాడని ఆ తల్లి అమాయకంగా పైకి వెళ్లింది.
అభిషేక్ రూంలోకి వెళ్లగానే ఏదో జరిగిందని ఆమె అనుమానపడింది. అయితే.. ఆమె ఏం జరిగిందో తెలుసుకునేలోపే కాల్చి చంపేశాడు. ఆ వెంటనే కిందకు వచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న తండ్రి బబ్లూను కాల్చి చంపేశాడు. అయితే.. కిందపడిపోయిన తండ్రి గిలగిలా కొన ప్రాణాలతో కొట్టుకుంటుండటంతో పాశవికంగా మరో రెండు బుల్లెట్లను అభిషేక్ తండ్రి శరీరంలోకి దించాడు.