మండీ: కొందరు ఎందుకు ప్రేమిస్తారో, ఎందుకు పెళ్లి చేసుకుంటారో వాళ్లకే తెలియదు. ప్రేమించిన వ్యక్తిపై అప్పటివరకూ ఉన్న ప్రేమ మరో వ్యక్తి పరిచయం కాగానే మాయమవుతున్న రోజులివి. పెళ్లయిన సంగతి కూడా మర్చిపోయి కొత్తగా పరిచయం అయిన వాళ్లతో వెళ్లిపోతున్నారు. కన్న బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ అనే ప్రాంతంలో వెలుగుచూసింది. హీనా అనే మహిళ ఒకరిని ప్రేమించింది. 2011లో అతనినే పెళ్లి కూడా చేసుకుంది.
కొన్నేళ్లు కాపురం సాఫీగా సాగిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒకరికి తొమ్మిదేళ్ల వయసు, మరొకరు రెండేళ్ల చిన్నారి. అయితే.. హీనా ఈ మధ్య జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసింది. భర్తను నిర్లక్ష్యం చేసి మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. కొన్నాళ్లకు ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. హీనా అత్త కొన్నేళ్ల క్రితం చనిపోయింది.
ఆ సందర్భంలో ప్రియుడితో కలిసి భర్త, పిల్లలను వదిలేసి ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఎక్కడుందో కనుగొని తిరిగి తీసుకొచ్చారు. అయితే.. ఇటీవల ఆమె మళ్లీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈసారి తనతో పాటు ఇద్దరు కూతుర్లను తీసుకెళ్లింది. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో హీనా ఆచూకీ కోసం వెతకగా కొన్నిరోజులకు ఆమె తన ప్రియుడితో కలిసి కనిపించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు పిల్లలేరని అడగ్గగా.. ఆమె చెప్పిన విషయం పోలీసులకు మింగుడు పడలేదు.
తన పిల్లలిద్దరినీ లోయలోకి తోసి చంపేసినట్లు హీనా చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లల కోసం తనను వెనక్కి తీసుకొస్తున్నారని, ఆ పిల్లలే లేకపోతే ప్రియుడితో కలిసి సుఖంగా ఉండొచ్చనే ఆలోచనతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. హీనా నేరాన్ని అంగీకరించడంతో కోర్టు ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధించింది.
నిందితురాలు చెప్పిన వివరాల మేరకు స్పాట్‌కు వెళ్లి వెతకగా హీనా ఇద్దరు కూతుర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్ట్‌మార్టం అనంతరం ఆ ఇద్దరి పిల్లల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన హీనాను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కన్న తల్లి అయి ఉండి ఇలా చేయడానికి చేతులెలా వచ్చాయని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.