ప్రేమకథకు విషాద ముగింపు 2023 జనవరి 22న జరిగింది. రాజస్థాన్.. నాగౌర్ జిల్లాలోని శ్రీబాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ క్రైమ్. ఎనిమిదో తరగతి పాసైన యువకుడు అనోపరామ్ తన ప్రియురాలిని ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి విసిరేశాడు. ఐతే.. అనోపరామ్కి ఆల్రెడీ వేరే యువతితో పెళ్లైంది. అలాగే.. అతని చేతిలో చనిపోయిన ప్రియురాలికి కూడా వేరే వ్యక్తితో పెళ్లైంది.
ఇద్దరూ తమ తమ పెళ్లిళ్ల తర్వాత ప్రేమలో పడ్డారు. "నేను నా భర్తను వదిలేస్తాను.. నువ్వు నీ భార్యను వదిలేయ్. మనం పెళ్లి చేసుకుందాం" అంది ప్రియురాలు. ఇది అనోపరామ్కి ఇష్టం లేదు. ఆమెతో ప్రేమ మాత్రమే కొనసాగించాలి అనుకున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశం అతనికి లేదు. కానీ ఆమె ఇదే విషయాన్ని పదే పదే ఎత్తుతుంటే.. చిరాకొచ్చి ఆమెను లేపేయాలని డిసైడ్ అయ్యాడు. ఎలా చంపాలి అనే దానిపై యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూశాడు. ఓ మర్డర్ ప్లాన్ వేసుకున్నాడు.
జనవరి 22న ముండాసర్లోని అత్తమామల ఇంటికి వెళ్తున్నానని చెప్పి పుట్టింటి నుంచి బయలుదేరింది ప్రియురాలు. కానీ ఆమె అత్తారింటికి వెళ్లలేదు, అలాగని పుట్టింటికీ రాలేదు. ఆమె భర్త, ఆమె తల్లిదండ్రులూ... జనవరి 24న శ్రీబాలాజీ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఐతే.. ఆమె ప్రియుడి దగ్గరకు వెళ్లింది. ప్లాన్ ప్రకారం ప్రేయసిని హత్య చేసిన తర్వాత... చాలా నీట్గా ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి రహస్యంగా ఓచోట పారేశాడు అనోపరామ్.
పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల సమాచారంతో కూపీ లాగగా... వివాహేతర సంబంధం విషయం తెలిసింది. వెంటనే అనోపరామ్ని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించగా... జనవరి 22న బల్వా రోడ్డులోని అడవిలో తన ప్రియురాలిని హత్య చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత అతను చెప్పింది విని పోలీసులకు చెమటలు పట్టాయి.
మూడు రోజులుగా దేర్వ గ్రామంలోని బావిలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో 12 మంది SDRF సిబ్బంది కూడా పాల్గొన్నారు. పగలు, రాత్రి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కానీ ఆ బావిలో ఇంకా మృతదేహ ఆనవాళ్లు దొరకలేదు. స్థానిక పోలీసు స్టేషన్, ఉన్నతాధికారులు అక్కడే మకాం వేశారు. SDRF సిబ్బంది పదే పదే టార్చ్లతో బావి వద్దకు వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఆదివారం మూడో రోజు. ఇవాళ నాలుగో రోజు. పోలీసులు ఇంతవరకు విజయం సాధించలేదు.