బీహార్‌లోని పాట్నాలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడిపై కాల్పులు జరిగిన ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. జిమ్ ట్రైనర్ విక్రమ్‌పై కాల్పులు జరిపించింది మరెవరో కాదని అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న డాక్టర్ రాజీవ్ కుమార్ భార్య కుష్బూనేనని తెలిసింది. కాల్పులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రాజీవ్ కుమార్ సింగ్, అతని భార్య కుష్బూనే విక్రమ్‌ను చంపాలని తమతో డీల్ కుదుర్చుకున్నారని నిందితులు బయటపెట్టారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విక్రమ్.. డాక్టర్ భార్యతో తనకున్న సంబంధాన్ని బయటపెట్టాడు. ఆమెతో తనకు వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు. అంతేకాకుండా.. ఆమెతో చనువుగా ఉన్న కొన్ని సందర్భాల్లో తీసుకున్న ఫొటోలను కూడా బయటపెట్టాడు. దీంతో.. పోలీసులు విక్రమ్, కుష్బూ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. వీళ్లిద్దరి కాల్ డేటాను పరిశీలించగా అర్ధరాత్రి సమయాల్లో గంటల కొద్దీ కాల్స్ మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో మరో షాకింగ్ ట్విస్ట్ పోలీసుల విచారణలో బయటపడింది.
డాక్టర్ రాజీవ్ భార్య కుష్బూ ఐదేళ్ల క్రితం ధనపూర్‌కు చెందిన మిహిర్ అనే ఓ వ్యక్తితో చనువుగా ఉండేది. భర్తకు తెలియకుండా ఆ వ్యక్తితో కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. కుష్బూ జీవితంలోకి జిమ్ ట్రైనర్ విక్రమ్ సింగ్ కూడా రావడంతో ఇతనితో కూడా కుష్బూ పరిచయం పెంచుకుంది. క్రమక్రమంగా మిహిర్‌కు దూరం జరుగుతూ వచ్చింది. విక్రమ్‌తో కుష్బూ పరిచయం కాస్తా చనువుగా మారింది. విక్రమ్, కుష్బూ కలిసి పబ్‌లకు, పార్టీలకు కూడా వెళ్లేవారు. ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ పలుమార్లు శారీరకంగా కూడా కలిశారు. ఇద్దరి మధ్య ఎంత చనువు ఉందనే విషయాన్ని ఈ ఫొటోలు చెప్పకనే చెబుతున్నాయి.
అయితే.. విక్రమ్‌తో కుష్బూ సంబంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అతనితో షాపింగ్‌లు, పార్టీలకు తిరిగిన కుష్బూకు మళ్లీ తన పాత ప్రియుడు మిహిర్‌పై మనసు మళ్లింది. ఈలోపు విక్రమ్, కుష్బూ వివాహేతర సంబంధం గురించి ఆమె భర్త డాక్టర్ రాజీవ్‌కు తెలిసింది. అప్పటికే పాత ప్రియుడికి దగ్గరవడం, భర్తకు కూడా విషయం తెలిసిపోవడంతో విక్రమ్ హత్యకు భర్తతో కలిసి కుష్బూ ప్లాన్ చేసింది. తన పాత లవర్ మిహిర్‌కు విక్రమ్ గురించి చెప్పింది. దీంతో.. మిహిర్ తనకు తెలిసిన కిల్లర్స్ ఉన్నారని.. వాళ్లతో మాట్లాడతానని కుష్బూకు హామీ ఇచ్చాడు.
కుష్బూకు చెప్పినట్టుగానే మిహిర్ విక్రమ్‌ను చంపేందుకు అమాన్ అనే వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నాడు. లక్షా 85 వేలు ఇచ్చేలా డీల్ కుదిరింది. విక్రమ్ రోజువారీ కదలికలపై నిందితుడు రెండు నెలల క్రితం రెక్కీ నిర్వహించిన తర్వాత సెప్టెంబర్ 18న కదమ్కౌన్ ప్రాంతంలో బైక్‌పై వెళుతున్న విక్రమ్ సింగ్‌పై నిందితుడు కాల్పులు జరిపాడు. ఐదు బుల్లెట్లు విక్రమ్ శరీరంలోకి వెళ్లాయి. అయితే.. విక్రమ్ పడుతూ లేస్తూనే బైక్ డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ వద్దకు వెళ్లి కుప్పకూలిపడిపోయాడు. అతనిని ఆసుపత్రి దగ్గర ఉన్న కొందరు చూసి సకాలంలో వైద్యం అందేలా చేయడంతో విక్రమ్‌కు ప్రాణాపాయం తప్పింది.
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో విక్రమ్ తనను చంపాలని చూసింది డాక్టర్ రాజీవ్, అతని భార్య కుష్బూనని చెప్పాడు. పాట్నా పోలీసులు డాక్టర్ రాజీవ్ కుమార్‌ను, అతని భార్య కుష్బూను విచారించారు. బాధితుడు చెప్పినట్లుగా ఆధారాలు లభించకపోవడంతో ఇద్దరినీ విడిచి పెట్టారు. అయితే.. కాల్పులకు పాల్పడిన వ్యక్తి దొరకడం, అతను డాక్టర్ రాజీవ్, కుష్బూ పేర్లు బయటపెట్టడంతో ఈ హత్యకు కుట్ర పన్నిన డాక్టర్‌కు, డాక్టర్ భార్య కుష్బూకు శిక్ష తప్పలేదు. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. జనవరి నెల నుంచి ఇప్పటివరకూ కుష్బూ, విక్రమ్ మధ్య 1100 సార్లు ఫోన్ కాల్స్ నడిచాయి. అన్నీ అర్ధరాత్రి సమయంలో మాట్లాడుకున్న సంభాషణలే కావడం గమనార్హం. కాల్ చేసిన ప్రతిసారి ఇద్దరూ 30 నుంచి 40 నిమిషాలు మాట్లాడుకునేవారు. అయితే.. ఏప్రిల్ 18న తొలిసారిగా విక్రమ్ నంబర్‌కు కుష్బూ భర్త డాక్టర్ రాజీవ్ నుంచి కాల్ వెళ్లింది. చంపేస్తానని ఫోన్లో విక్రమ్‌ను రాజీవ్ బెదిరించాడు.
ఈ క్రమంలోనే.. నిందితుడు విక్రమ్‌పై కాల్పులకు తెగబడ్డాడు. కదంకౌన్ ప్రాంతంలో విక్రమ్‌పై కాల్పులు జరిపిన నిందితుడు 5 బుల్లెట్లను విక్రమ్ శరీరంలోకి దించాడు. సెప్టెంబర్ 18న ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్కూటీపై విక్రమ్ జిమ్ సెంటర్‌కు వెళుతుండగా కదమ్కౌన్ ప్రాంతంలోని బుద్ధ విగ్రహం సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వివాహేతర సంబంధం ఎంతమందిని చిక్కుల్లో పడేస్తుందో ఈ వ్యవహారం చెప్పకనే చెబుతోంది.