హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని కేబీఆర్ పార్కులో సినీ నటి షాలూ చౌరాసియాపై దాడి వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వాకింగ్, జాగింగ్ చేసే ప్రాంతం కావడంతో కేబీఆర్ పార్కులో దాడి ఘటన సంచలనం రేపింది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఐదురోజుల్లోనే పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు.
నటి షాలూ చౌరాసియా గత ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో కేబీఆర్ పార్కు వాక్‌వేపై జాగింగ్ చేస్తుండగా.. ఆమెపై దాడి చేశాడు. పెనుగులాటలో గాయపడ్డ షాలూ.. ఎలాగోలా దుండగుడి బారి నుంచి తప్పించుకుని బయటికి పరుగులు తీయగా, ఆమె సెల్ ఫోన్ తీసుకుని దుంగడుగు పరారయ్యాడు. బయటికొచ్చిన హీరోయిన్.. అక్కడున్నవాళ్ల సహాయంతో 100కు డయల్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఈ మేరకు దాఖలైన ఫిర్యాదులో..
ఆదివారం రాత్రి వాకింగ్ చేస్తున్న తనపై దుండగుడు దాడి చేసి.. ముందుగా రూ. 10 వేలు డిమాండ్ చేశాడని, క్యాష్ లేదు, పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోకుండా అతను మీద పడ్డాడని, బండరాయి పక్కన కిందకు తోసేసి నలిపేసే ప్రయత్నం చేశాడని, తాను శక్తినంతా కూడదీసుకుని అతనితో కలబడ్డానని, ఒక దశలో ముఖంపై బండతో బాది హత్య చేసేందుకు కూడా దుండగుడు యత్నించాడని, చివరికి ఫెన్సింగ్ దూకి బయటికి పరుగులు తీశానని హీరోయిన్ షాలూ పేర్కొంది.
కేబీఆర్ పార్కులో నటిపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితుడు ఎత్తుకెళ్లిన హీరోయిన్ ఫోన్ ను ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. దాడి జరిగిన రోజు (ఆదివారం) రాత్రి 11.40 గంటలకు నిందితుడు ఇందిరానగర్ ప్రాంతంలో సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, అస్పష్టమైన చిత్రాలు లభించాయి. నిందితుడు ఆ రోజు వేసుకున్న షర్ట్, ప్యాంట్ కలర్ లను మ్యాచ్ చేస్తూ నిందితుడి ఊహాచిత్రాన్ని గీయించిన పోలీసులు..
నిందితుడి ఊహాచిత్రంతో ఆ ఊహాచిత్రం ఆధారంగా గురు, శుక్రవారాల్లో ఇందిరానగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో సినీ కార్మికులు ఉండే ప్రాంతాలను పోలీసులు జల్లెడపట్టారు. ఎట్టకేలకు ఆరోజు నిందితుడు వేసుకున్న షర్ట్‌ను గుర్తించిన సహచరులు పోలీసులకు తగిన ఆధారాలు అందజేశారు. దీంతో పోలీసులు నిందితుడి గదిలో ఉండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెల్‌ఫోన్ దొరకడంతో అతడే నిందితుడని నిర్ధారించారు.
నటి షాలూపై దాడికి పాల్పడిన వ్యక్తి సినీ పరిశ్రమలో కార్మికుడు కావడం గమనార్హం. ఈ కేసులో నిందితుడిని తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబు (30)గా గుర్తించామని, అతణ్ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించామని పోలీసులు చెప్పారు. నిందితుడు బాబుది మహబూబ్ నగర్ జిల్లా కల్కచెర్ల. కాగా, విచారణలో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి..
ఘటన జరగడానికి నాలుగు రోజుల ముందునుంచే నటి షాలూపై నిందితుడు బాబు రెక్కీ నిర్వహించాడని, కేబీఆర్ పార్కులో జనసంచారం తక్కువగా ఉండే, సీసీటీవీ నిఘా లేని ప్రాంతాన్ని ఎంచుకుని, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే నటిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లుగా తేలింది. తాను దొంగతనానికి రాలేదని, అత్యాచారం చేయడానికే వచ్చినట్లుగా నిందితుడు అంగీకరిచాడని పోలీసులు చెప్పారు.
టాలీవుడ్ లో పనిచేయడానికి దేశం నలుమూలల నుంచి వందల సంఖ్యలో అమ్మాయిలు వస్తున్న దరిమిలా వాళ్లకు హైదరాబాద్ సేఫ్ ప్లేస్ కాదనే తప్పుడు సంకేతాలు వెళాయనే కోణంలో పోలీసులు షాలూపై దాడి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తానికి ఐదు రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేయడం ద్వారా అందరికీ భరోసా దక్కినట్లయింది. ఆధారాలు పక్కాగా ఉండటంతో నిందితుడికి కఠిన శిక్షలు పడే అవకాశాలున్నాయి.