హుగ్లీ: ప్రస్తుతం సమాజంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫేస్బుక్ పరిచయాలు, ఇన్‌స్టాగ్రాంలో చాటింగ్‌లు.. ఇలా ఏ సోషల్ మీడియా యాప్‌ను వదలకుండా అన్నింటినీ వాడేస్తున్నారు. అయితే.. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా వినియోగం వల్ల అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, ఆ పరిచయాల వల్ల జరిగే అనర్థాలను కూడా కొట్టిపారేయలేం.
కానీ.. సోషల్ మీడియా వినియోగం కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తిన ఘటనలు మాత్రం అరుదు. పశ్చిమ బెంగాల్లో తాజాగా ఈ తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాకు చెందిన పల్లవి(23), రింటూ దాస్ భార్యాభర్తలు. పెళ్లయిన కొన్నాళ్లు ఈ జంట వైవాహిక జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ.. పల్లవి స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నప్పటి నుంచి రింటూకు ఆమెపై అనుమానం పెరిగింది. ఫేస్బుక్ చాటింగ్‌లో భార్య బిజీగా గడుపుతున్న విషయం తెలిసి రింటూ మరింతగా ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.
ఫేస్బుక్లో మరో మగాడితో భార్య చాటింగ్ చేస్తుందని రింటూ భావించాడు. ఆమె క్యారెక్టర్‌ను తప్పుబట్టడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భార్యాభర్తల మధ్య పల్లవి ఫేస్బుక్ చాటింగ్ గురించి ఆదివారం కూడా గొడవ జరిగింది. అయితే.. ఈసారి గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. భార్యపై కోపంతో ఊగిపోయిన రింటూ క్షణికావేశంలో పల్లవి గొంతు కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పల్లవి కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది.
భార్యను చంపేసి అక్కడి నుంచి రింటూ పారిపోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య గురించి రింటూ తమ్ముడు మాట్లాడుతూ.. తన వదిన చాలా మంచిదని, కానీ తన అన్నయ్యే ఎప్పుడూ ఆమెను అనుమానంతో వేధిస్తూ ఉండేవాడని చెప్పాడు. ఎప్పుడూ వదినను ఇబ్బందిపెట్టేవాడని తెలిపాడు. తన అన్నయ్య వదినను బాధపెట్టడాన్ని చూడలేక తాను, తన తల్లి మరోచోట ఉంటున్నామని రింటూ తమ్ముడు సింటూ దాస్ చెప్పాడు.