చెన్నై: భార్యాభర్తలు పట్టపగలు కారులో వెళుతున్నారు. హైవేపై వెళుతుండగా ఇంతలో నలుగురు సభ్యులతో కూడిన ఓ గ్యాంగ్ వారి కారును అడ్డగించింది. వాళ్లు బైక్‌పై వెంబడించి.. అడ్డగించడంతో భయంతో భర్త కారు ఆపేశాడు. ఇంతలో ఆ గ్యాంగ్ కారులో ఉన్న భార్య గొంతు కోసేసింది. ఆమె మెడలో ఉన్న ఏడు సెవిరీల బరువున్న బంగారు గొలుసుతో ఆ గ్యాంగ్ అక్కడి నుంచి ఉడాయించింది. దాదాపు చావుకు దగ్గరైన భార్యను అదే కారులో భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలోని సీన్ కాదు. ఓ భర్త తన భార్యను హత్య చేసి ఆమెను ఇంకెవరో హత్య చేసినట్టుగా చిత్రీకరించేందుకు పోలీసులతో చెప్పిన మాటలివి. ఏ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూశాడో గానీ భార్యను హైవేపై వెళుతూ కారులో చంపితే ఎవరికీ అనుమానం రాదని, ఇలాంటి ఓ కట్టుకథ అల్లి పోలీసులను సులువుగా బోల్తా కొట్టించవచ్చని భావించాడు. పోలీసులు అతను చెప్పిన మాటలతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
అక్కడ ఎవరో గ్యాంగ్ చంపినట్లు గానీ, దోపిడి జరిగినట్లు గానీ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై అనుమానం వచ్చింది. అప్పుడు అయ్య గారిని పిలిచి తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటికొచ్చింది. భార్యను చంపి హత్య కేసు నుంచి బయటపడేందుకు తానే ఈ నాటకం ఆడినట్లు ఒప్పుకున్నాడు. అక్కడ ఎలాంటి దారి దోపిడి జరగలేదు.
ఏ గ్యాంగ్ ఈ భార్యాభర్తలను బైక్‌పై వెంబడించి.. అడ్డగించి.. గొంతు కోసి.. బంగారం దోచుకెళ్లలేదు. ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తే భార్యను చంపేశాడు. ఈ కట్టు కథ అల్లి తాను ఈ కేసులో ఇరుక్కోకుండా బయటపడాలనుకున్నాడు. కానీ.. పోలీసులు చురుగ్గా వ్యవహరించడంతో ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసుల విచారణలో భార్యను ఎందుకు చంపాడో నిందితుడు చెప్పాడు. నిందితుడు చెప్పిన విషయాలు పోలీసులకు దిమ్మతిరిగేలా చేశాయి.
సినీ ఫక్కీని తలపిస్తున్న ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తమిళనాడులోని కుమారపాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోడ్ జిల్లా అంధియూర్కు చెందిన కె.శబరినాథన్(30), సాలెంలోని అత్తూరుకు చెందిన ధరణిదేవి(25) మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న బాబు కూడా ఉన్నాడు. వీరి జీవితం సాఫీగా సాగుతుండగా శబరినాథన్కు అంతకు ముందే మరో మహిళతో పెళ్లైందన్న విషయం ధరణిదేవికి తెలిసింది.
ఇరు కుటుంబాలు శబరినాథన్కు, ధరణిదేవికి పెళ్లి చేశాయి. ఈ విషయం శబరినాథన్ మొదటి భార్య రేవతికి తెలిసింది. శబరినాథన్ అందుబాటులో లేకపోవడంతో అతని సోదరుడు మోహన్‌ను ఇదేంటని నిలదీసింది. శబరినాథన్, తాను కాపురం చేస్తున్నామని.. రెండుసార్లు అబార్షన్ కూడా చేయించుకున్నానని ఆమె మోహన్‌కు చెప్పింది. తనకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేసింది.
శబరినాథన్ కుటుంబం రేవతి విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో రేవతి ఏకంగా ధరణిదేవికే విషయం చేరవేయాలని నిర్ణయించుకుంది. తాను రేవతినని, శబరినాథన్ మొదటి భార్యనని.. తనను ఎప్పుడు పెళ్లి చేసుకుంది.. ఎక్కడ చేసుకుంది.. అన్ని విషయాలను పొందుపరుస్తూ ధరణిదేవికి రేవతి లేఖ రాసింది. ఆ లేఖతో పాటు వారిద్దరికీ పెళ్లయినట్లు ఉన్న సాక్ష్యాధారాలను కూడా పంపింది.
ఆ ఫొటోలను, లేఖను చూసిన ధరణిదేవి తాను మోసపోయానని.. తన భర్త మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని అతనితో గొడవ పెట్టుకుని బాబును తీసుకుని ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. తనను వదిలేస్తే ఎంతవరకైనా వెళతానని రేవతి హెచ్చరించడంతో ఇక ఇద్దరిలో ఒకరే బతికుండాలని.. అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారమని శబరినాథన్ భావించాడు.