గుజరాత్... అహ్మదాబాద్‌లో జరిగిన విషాద ఘటన ఇది. చాలా మంది అయ్యో పాపం అంటున్నారు. జాలిపడుతున్నారు. అది తూర్పు అహ్మదాబాద్ ఏరియా. ఆమె మాజీ భర్త... మరికొందరు స్నేహితులతో వచ్చి... కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. అతనితో వచ్చిన వారు కూడా తలో కత్తీ తీసుకొని ఆమెను పొడిచారు. ఆమె ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలోనే ఈ హత్య జరిగింది.
తూర్పు అహ్మదాబాద్‌లోని వత్వా ఏరియా ఒక్కసారిగా షాకైంది. మాజీ భర్తే ఆమెను చంపేశాడని తెలిసి... స్థానికులు అవాక్కయ్యారు. ఆమె పేరు హేమ మరాతీ. సుఖ్ నగర్ సొసైటీ నివాసి. ఆమె మాజీ భర్త అజయ్ ఠాకూర్, అతని ఫ్రెండ్స్ కలిసి... 20 సార్లకు పైగా ఆమెను పొడిచి చంపారు. ఆమె ప్రస్తుత భర్త మహేష్ ఠాకూర్... వత్వా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు.
హేమ... ఇదివరకు అజయ్‌ని పెళ్లి చేసుకుంది. అతను థారా గ్రామానికి చెందినవాడు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత ఆమెతో సరిగా కాపురం చెయ్యలేదు అజయ్. క్రమంగా అతను ఆమెకు దూరమయ్యాడు. భార్యభర్తల మధ్య గ్యాప్ పెరిగింది. అదే సమయంలో... మహేష్... ఆమె జీవితంలోకి ఎంటరయ్యాడు. భర్త నుంచి ఆమె సరైన ప్రేమానురాగాలు పొందలేకపోతోందని గ్రహించాడు. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఊ అంటే పెళ్లి చేసుకుంటాను. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు మహేష్. ఆమె బాగా ఆలోచించింది. అజయ్ కంటే మహేష్ అన్ని రకాలుగా మంచివాడని భావించింది. దాంతో... ఏడాదిన్నర కిందట ఇష్టపూర్వకంగానే అజయ్ నుంచి విడాకులు తీసుకుంది. తన ఇద్దరు పిల్లల్నీ ఆమె అజయ్‌కే వదిలేసింది. ఆ తర్వాత మహేష్‌ని చోటిలా ఆలయంలో పెళ్లి చేసుకుంది. ఇద్దరూ హాయిగా జీవిస్తున్నారు.
తనకు విడాకులు ఇచ్చి... పిల్లల్ని తనకే వదిలేసిన హేమను చూస్తూ... రోజూ భరించలేకపోయాడు అజయ్. తన కళ్ల ముందే... మరో వ్యక్తితో హాయిగా ఆమె ఉంటుండటాన్ని సహించలేకపోయాడు. ఆ క్రమంలో... అసలు నేను చేసిన తప్పేంటి... పెళ్లి చేసుకున్నా... ఇద్దరు పిల్లలున్నారు... మరి నన్నెందుకు వదిలేసింది. మరో మగాడు తగిలితే... ఇక నేను పనికిరాని వాణ్ని అయ్యానా అని తనకు తానుగా ఏవేవో ఊహించుకున్నాడు. దాంతో ఆమెపై అసహ్యం, కోపం, ఆవేశం, పగ, ప్రతీకారం వంటివి పెంచుకున్నాడు. దానికి తోడు అతని స్నేహితులు కూడా అతన్ని రెచ్చగొట్టారు. నీ కళ్ల ముందే వేరే వాడితో హ్యాపీగా ఉంది. నీ పిల్లల్ని నీ మొహాన కొట్టింది. నువ్వూ ఉన్నావ్... ఎందుకూ అంటూ ఆక్రోశాన్ని రగిల్చారు. ఆ క్రమంలో... ఆమెను చంపేస్తేనే తనకు మనస్శాంతిగా ఉంటుందని డిసైడయ్యాడు. అలా స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఈ విషయాన్ని పక్కింటాయన ద్వారా తెలుసున్నాడు మహేష్.
ఇక్కడో షాకింగ్ విషయం ఉంది. అజయ్‌తో కలిసి మరో ముగ్గురు ఈ హత్య చేశారు. వారిలో ఓ అమ్మాయి కూడా ఉంది. మొత్తం నలుగురూ... ఎకో కారులో ఆమె ఇంటి దగ్గరకు వచ్చి వెయిట్ చేశారు. ఆమె ఒంటరిగా బయటకు వచ్చి... పచారీ సామాన్ల కోసం వెళ్తుండగా హత్య చేశారు. ఆ అమ్మాయి కూడా కత్తితో పొడిచిందని పక్కింటాయన పోలీసులకు చెప్పాడు.
హత్య చేశాక... అజయ్ ఫ్రెండ్స్ అంతా పారిపోయారు. అజయ్ మాత్రం తన పాత ఇంట్లోనే ఉన్నాడు. తనే మర్డర్ చేశానని చెప్పాడు. తనకు ఏ శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తానన్నాడు. పోలీసులు ఆ మిగతా ముగ్గురి కోసం వెతుకుతున్నారు. ఇలా ఓ గృహిణి... పద్ధతిగా విడాకులు తీసుకొని... మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా... చివరకు ప్రాణాలు పోయాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.