మీరట్: వాళ్లిద్దరికీ ట్రైన్లో పరిచయం ఏర్పడింది. ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు తీసుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. కానీ.. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే భార్యను ఆమె భర్త హత్య చేశాడు. ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగుచూసింది.
ఒకరితో మరొకరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు తీసుకునేంత వరకూ వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్ల స్నేహం తర్వాత ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తొలుత రూబీ తండ్రి పెళ్లికి ఒప్పుకోకపోయినా రూబీ ఇష్టాన్ని కాదనలేక ఎట్టకేలకు ఒప్పుకున్నాడు.
పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించడంతో దీపక్, రూబీ వివాహం జరిగింది. ఒక పాప పుట్టింది. తొలి పుట్టినరోజును ఘనంగా చేశారు. కానీ.. కొన్ని నెలల తర్వాత ఆ పాప అనారోగ్యం కారణంగా చనిపోయింది. కొన్నాళ్లకు దీపక్ తండ్రి రాజ్‌కుమార్ చనిపోవడంతో దీపక్‌కు, అతని తమ్ముడు గుడ్డూకు మధ్య విభేదాలొచ్చాయి. దీపక్ మరోచోట మూడంతస్తుల ఇల్లు కట్టుకుని.. ఆ బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో వ్యాపారం చేశాడు. లాక్డౌన్ కారణంగా వ్యాపారంలో దీపక్ నష్టపోయాడు.
దీంతో.. అప్పటి నుంచి రూబీకి అదనపు కట్నం గురించి వేధింపులు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని ఆమెను దీపక్ ఇబ్బందిపెట్టసాగాడు. ఆర్థిక సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ గొడవలు చిలికిచిలికి గాలివానగా మారడంతో క్షణికావేశంలో దీపక్ తాను ప్రేమించిన రూబీని హత్య చేసి చంపేశాడు. పోలీసులు దీపక్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రూబీ తండ్రి రామచంద్ర గుప్త ఆరుగురిపై అదనపు కట్నం కోసం తన కూతురిని చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేశారని.. తన కూతురు వాళ్ల డిమాండ్‌ను నెరవేర్చకపోవడంతో హత్య చేశారని రూబీ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.