మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న ఓ యువతికి నెలసరి రావడంతో బాత్రూమ్కు వెళ్లింది. బహిష్టు కారణంగా రక్తస్రావం అయింది. ఆ యువతి బాత్రూమ్లోకి వెళ్లిన సందర్భంలో నీళ్లు రావడం లేదు. దీంతో.. నీళ్లతో బాత్రూమ్ను శుభ్రం చేసే అవకాశం లేకపోవడంతో ఆ బాలిక అలానే బయటకు వచ్చేసింది.
ఆ తర్వాత ఆమె వెళ్లిన బాత్రూమ్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి హాస్టల్ యాజమాన్యం బాత్రూమ్కు వెళ్లింది ఎవరో, నెలసరి ఎవరికి వచ్చిందో తెలుసుకునేందుకు ఆ హాస్టల్లోని అమ్మాయిలందరికీ లోదుస్తులు తొలగింరి తనిఖీ చేశారు. ఈ ఘటనతో బాధిత యువతి మానసికంగా తీవ్ర మనోవేదనకు గురయింది. ఈ ఘటనపై బాధిత యువతి తల్లిదండ్రులు మీరట్ ఎస్ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ తరహా ఫిర్యాదు రావడం ఇదే తొలిసారి అని మీరట్ ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి తెలిపారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటన ఎలా బయటకు వచ్చిందంటే.. కిథోర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురిని మీరట్‌లోని ఓ కాలేజీలో చేర్పించాడు. ఓ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్లో కూతురుని ఉంచి బాగా చదువుకోమని చెప్పి హాస్టల్ ఫీజు కట్టేసి వెళ్లిపోయాడు. సెప్టెంబర్ 12న కూతురు చదువుతున్న కాలేజీలోని తన మేనకోడలిని కూడా చేర్పించాడు.
ఒకరికొకరు తోడుగా ఉంటారని కూతురుని ఉంచిన హాస్టల్లోనే మేనకోడలిని ఉంచి హాస్టల్ ఫీజు కట్టేసి వెళ్లిపోయాడు. సెప్టెంబర్ 19న తన మేనకోడలు ఫోన్ చేసి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. ఆమె అలా చెప్పడంతో డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆమె మానసిక ఒత్తిడికి లోనయిన విషయాన్ని గమనించిన డాక్టర్ అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో బాధిత యువతి జరిగిందంతా చెప్పింది.
తనకు నెలసరి రావడంతో బాత్రూమ్కు వెళ్లానని.. బాత్రూమ్ను శుభ్రం చేసేందుకు చూడగా నీళ్లు రాలేదని.. దీంతో చేసేదేమీ లేక బయటకు వచ్చానని తెలిపింది. ఎవరికి నెలసరి వచ్చిందో తెలుసుకునేందుకు హాస్టల్ యాజమాన్యం చేసిన చర్య వల్ల తాను మానసికంగా కలత చెందానని, ఈ చర్య పట్ల హాస్టల్లోని అమ్మాయిలంతా నిరసన తెలిపారని ఆమె చెప్పింది. ఈ ఘటన కారణంగా హాస్టల్లోని చాలామంది విద్యార్థినులు ఖాళీ చేసి వెళ్లిపోయారు.