తన కోపమే తనకు శత్రువు అంటారు... ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దంటారు... పెద్దలు ఎన్ని చెప్పినా... వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి. కొంత మంది ఆవేశంలోనే నిర్ణయాలు తీసుకొని... లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ కేసులో అటు భార్య ఆవేశం, ఇటు భర్త ఆవేశం... రెండూ అనర్థాలకే దారితీశాయి. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. అతనేమో జైలుపాలయ్యాడు. ఇప్పుడు అయ్యో దేవుడా అంటూ నెత్తీ నోరూ బాదుకుంటున్నాడు. పిల్లలేమో ఒంటరి అయ్యారు.
గుజరాత్‌లోని... దమ్కాకి చెందిన విక్రమ్‌భాయ్... పువాలాకి చెందిన మీనాబెన్ను 15 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు, ముగ్గురు అబ్బాయిలు. చక్కటి కుటుంబం. అంతా సంతోషంగా ఉండేవారు. ఐతే... ఈ కరోనా వచ్చాక... వారి జీవితాలు తలకిందులు అయ్యాయి. ఏ రోజుకారోజే ఎలా గడుస్తుంది అనేది వాళ్లకు అతి పెద్ద సమస్యగా మారింది.
రోజువారీ కూలిపనులు చేసుకొని బతికే ఈ దంపతులు... తమ పిల్లల్ని వ్యవసాయపనులకు పంపిస్తున్నారు. తాజాగా జూన్ 21 వచ్చినా... చేతికి కూలి డబ్బులు రాకపోవడంతో... కుటుంబ సభ్యుల్లో అసహనం బాగా పెరిగింది. ఆ చిరాకులో మీనాబెన్ ఉన్నప్పుడు... ఆ పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ గోల చేయడం మొదలుపెట్టారు. గోల చెయ్యవద్దని మీనాబెన్ 2 సార్లు చెప్పినా వాళ్లు ఆపలేదు. ఆ కేకలు, అరుపులూ భరించలేక... మీనాబెన్... వాళ్లపై చేయి చేసుకుంది. దబాదబా బాది... అరిస్తే చంపుతా అని బెదిరించింది.
అప్పటికే డబ్బు లేక... చిరాకులో ఉన్న మీనాబెన్ భర్త... విక్రమ్... ఆమె అలా పిల్లల్ని బాదేసరికి... కోపంతో రగిలిపోయాడు. పిల్లల్ని కొడతావా... నా పిల్లల్ని కొడతావా అంటూ... రెచ్చిపోయాడు. ఆ మూలన ఉన్న చెక్క కర్రతో ఆమె తలపై సిక్సర్ బాదినట్లు బాదాడు. అది బలంగా తగిలింది. అంతే... ఒక్కసారిగా ఆమె పెద్దకళ్లతో... చూస్తూ... నేలపై పడింది. ఆ తర్వాత గిలగిలా కొట్టుకుంటుంటే... విక్రమ్ షాక్ అయ్యాడు. పిల్లలు ఆశ్చర్యంతో ఏడుపు ఆపేశారు. విక్రమ్ చేతిలో కర్ర జారి కింద పడింది. ఆమె కొన్ని క్షణాలకే చనిపోయింది. విక్రమ్ శిల అయ్యాడు. షాక్ అయ్యాడు. ఆమెను అటూ ఇటూ కదిపాడు, పైకి లేపాడు ఏం చేసినా కదలిక లేదు. చనిపోయిందని అర్థమైంది. అంతే భయంతో ఇంట్లోంచీ పారిపోయాడు.
పిల్లలు పక్కింటి వాళ్లకు విషయం చెప్పారు. స్థానికులు పోలీసులకు చెప్పారు. పోలీసులు స్పాట్‌కి వచ్చి... డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మీనాబెన్ తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్తో కేసు రాసుకొని... విక్రమ్ కోసం గాలించారు. ఊరి చివర నీరు లేని చెరువు దగ్గర... ఆందోళనతో, అయోమయంతో కూర్చొని టెన్షన్ పడుతున్న విక్రమ్‌ను అరెస్టు చేశారు. అటు తల్లి లేక... ఇటు తండ్రి జైలుపాలవ్వడంతో... తాతే ఆ పిల్లలకు దిక్కయ్యాడు. ఇలా ఆవేశాలు, చికాకులు... ఆ ఫ్యామిలీలో కన్నీటి విషాదాన్ని నింపాయి.