రద్దీగా ఉన్న రోడ్డు. ఇంతలో సడన్ గా ఓ ఆడీ కారు దూసుకొచ్చింది. రోడ్డుపై నానా బీభత్సం సృష్టించింది. ఓ ఆటోను ఢీకొట్టి రయ్యిమంది. అంతే కాదు అటుగా వచ్చిన కొన్ని వాహనాలను కూడా ఢీకొట్టి వెళ్లిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ కారు ఎవరిదో కనుక్కునే పనిని వెంటనే ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీలను వెలికితీశారు. ఎట్టకేలకు ఆ కారు ఉన్న వీడియోను పట్టేశారు.
ఆ కారు నెంబర్ ను నోట్ చేసుకుని సంబంధిత డిపార్ట్ మెంట్ కు పంపించారు. వాళ్లు పంపించిన వివరాలను చూసి ట్రాఫిక్ పోలీసులు కంగుతిన్నారు. కారణం ఆ కారు మామూలు వ్యక్తిది కాదు. ఓ బడా వ్యాపారవేత్తది. ఓ బాలీవుడ్ ప్రముఖ నటి భర్తది. ఇది నిజమేనా అని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాక ఆ వ్యాపారవేత్తను సంప్రదిస్తే ఆయన చెప్పింది విని మరింత అవాక్కయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
ఓ సీసీ కెమెరాలో ఆ కారు నెంబర్ స్పష్టంగా నమోదవడంతో వెంటనే ఆ ఆడీ కారు ఎవరిదో ఈజీగా తెలిసిపోయింది. బడా వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాది అని గుర్తించారు. అయితే పోలీసుల విచారణలో ఆ ఆడీ కారును రాజ్ కుంద్రా నాలుగు నెలల క్రితమే ముంబై కారు డీలర్ ద్వారా బెంగళూరులోని సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే షోరూమ్ లో అమ్మేశారని తెలిసింది. దీన్ని కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీసులు కూడా ధృవీకరించారు.
అయితే కారును సెకండ్ హ్యాండ్ లో అమ్మేసిన ఆయన, కారు పత్రాలను మాత్రం తన పేరు నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీదకు బదిలీ చేసే ప్రక్రియను పట్టించుకోలేదు. కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఈ మేరకు దృష్టి పెట్టలేదు. దీంతో ఆ ఆడీ కారు ఇంకా రాజ్ కుంద్రా పేరు మీదే ఉంది. మహ్మద్ సద్దాం అనే వ్యక్తి ఆ కారును బెంగళూరులో కొనుగోలు చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
ఆ యాక్సిడెంట్ జరగ్గానే అతడు ఆ కారును అక్కడే వదిలేసి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. కార్లను సెకండ్ హ్యాండ్ లో అమ్మేసిన తర్వాత పత్రాలను బదిలీ చేయకపోతే చేయని నేరాల్లో చిక్కుకుంటారనడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ అని పోలీసులు చెబుతున్నారు. కారు యజమాని కాబట్టి రాజ్ కుంద్రాకు నోటీసులు పంపిస్తామని, తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.