Operation Ganja in Andhra Pradesh: దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలం ఏపీ పేరే వినిపిస్తుండటం, విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి రవాణా విపరీతంగా జరుగుతుండటంతో.. ఈ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
ఆపరేషన్ పరివర్తన్ కు శ్రీకారం చుట్టింది. మూడు నెలల్లో గంజాయి సాగు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గంజాయి పంటను తొలగిస్తున్నారు. ఈ తొలగింపు సమయంలో కాస్త ఉద్రిక్తతలు కనిపిస్తున్నా.. పోలీసులు మాత్రం కచ్చితంగా తొలగించి తీరుతామని గిరిజన గ్రామ ప్రజలకు చెబుతున్నారు.. వారు అడ్డుకున్నా తొలిగింపు ప్రక్రియను ఆపడం లేదు.
ఏపీలో గంజాయి విక్రయాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలతూటాలు పేలి రాజకీయంగా సంచలనం రేపింది. పలు రాష్ట్రాల్లో పట్టుబడ్డ స్మగ్లర్లు తాము గంజాయిని విశాఖ నుంచి తీసుకొచ్చామని చెప్పారు. గంజాయికి విశాఖ అడ్డాగా మారిందనే విమర్శలు వచ్చాయి. దీంతో గంజాయి అక్రమ రవాణను అరికడుతూనే, గంజాయి పంటను లేకుండా చేయాలని ప్రభుత్వం భావించింది.
మూడు రోజుల క్రితం తెలంగాణ, ఒడిశా, కర్నాటక, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ, ఎన్ ఫోర్స్ మెంట్, ఎక్సైజ్ అధికారులు సమావేశం అయ్యారు. గంజాయి నిర్మూలనపై చర్చించారు. స్వయనా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వైజాగ్ వచ్చి మరి క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఫోకస్ చేశారు. కిందిస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ వచ్చారు. వంద శాతం గంజాయి సాగు లేకుండా చేయడమే తమ లక్ష్యం అన్నారు.
మూడు రోజులుగా విశాఖలో గంజాయి పంటలను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. గంజాయి పంటలు ధ్వంసం చేయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ సహకారంతో 800మంది సిబ్బందితో 10 బృందాలు ఏర్పాటు చేశామన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. జి.మాడుగుల, జీకే వీధి మండలాల్లోని 270 ఎకరాల్లో ఉన్న గంజాయి పంటను ధ్వంసం చేశామన్నారు. గంజాయి పంట ధ్వంసానికి గ్రామస్తులు సహకరిస్తున్నారని డీజీపీ చెప్పారు. మొత్తం 400 ఎకరాల్లో హైబ్రిడ్ గంజాయి సాగు అవుతోందన్నారు.
గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. స్థానిక గిరిజన మహిళలతో పోలీసు అధికారుల బృందం చర్చలు జరిపారు. గంజాయి పెంపకంతో ఆధారపడి ఉన్న తమకు ఈ ఏడాది గంజాయి సాగుకు అవకాశం ఇవ్వాలని అధికారులను గిరిజనులు వేడుకున్నారు. వచ్చే ఏడాది నుంచి గంజాయి సాగు చెయ్యబోమని హామీ ఇచ్చారు.
బంగారం తాకట్టు పెట్టి మరి గంజాయి సాగుపై పెట్టుబడి పెట్టామని, ఈ ఒక్కసారికి వదిలేయాలని కన్నీటిపర్యంతం అయ్యారు గిరిజన మహిళలు. ఒకవేళ ఈ ఏడాది కొట్టేస్తామంటే.. నష్టపరిమారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, ఒక బృందం అధికారులు గిరిజన మహిళలతో చర్చలు జరుపుతుండగా.. మరో బృందం గంజాయి సాగును ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.