రామ్‌పూర్: భారతీయ వైవాహిక వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా గౌరవముంది. మన దేశంలో పెళ్లి అనే శుభకార్యాన్ని అంత పవిత్రంగా భావిస్తాం. కానీ.. కొందరు పెళ్లిని కూడా తాము చేసే మోసాలకు వాడుకుంటున్నారు. పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసి.. వివాహం అయి రెండు నెలలు కూడా గడవక ముందే డబ్బు, బంగారంతో ఆ యువతి ఉడాయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ పరిధిలో వెలుగుచూసింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రామ్‌పూర్‌కు చెందిన ఇర్ఫాన్‌కు అదే ప్రాంతానికి చెందిన ఇక్రా అనే యువతితో ఆగస్ట్‌లో వివాహమైంది. ఆమె అందచందాలను చూసి ఫిదా అయిపోయిన ఇర్ఫాన్ ఆమెలోని మోసాన్ని గ్రహించలేకపోయాడు. పెళ్లయి నెల దాటింది. రెండు నెలల కూడా గడవలేదు. కాపురం సాఫీగా సాగిపోతోంది. కానీ.. ఇటీవల ఒకరోజు రాత్రి భర్తకు ఇక్రా రోజూలానే పాలు తెచ్చి తాగమని ఇచ్చింది.
భార్య కుట్ర తెలియని ఇర్ఫాన్ ఆ పాలు తాగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్పృహ కోల్పోయాడు. ఇక్రా ఆ తర్వాత ఇంట్లోని 50 వేల డబ్బుతో పాటు, బంగారు నగలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లపోయింది. మెలకువ వచ్చి చూసేసరికి భార్య ఇంట్లో కనిపించలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడం, పాలు తాగిన వెంటనే తాను మత్తులోకి వెళ్లిపోవడంతో భార్య కుట్ర అప్పుడు ఇర్ఫాన్‌కు అర్థమైంది.