ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అన్నెమడుగు గ్రామానికి చెందిన గంగరాజు(20), గంగోత్రి(20) కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. గంగరాజు గంగోత్రికి తెలియకుండా ఆమె స్నేహితురాలు మౌనిక(19)తో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా మారింది. తాను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే సంగతి మరిచి మౌనికతో కూడా గంగరాజు ప్రేమాయణం సాగించాడు.
అంతేకాదు.. గంగోత్రికి హ్యాండిచ్చి మౌనికను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. రెండు కుటుంబాలకు గంగరాజు, మౌనిక ప్రేమ గురించి తెలిసింది. కులాలు ఒకటే కావడం, ఇద్దరూ ఒకరికొకరు వరసయ్యే వాళ్లే కావడంతో పెళ్లికి అడ్డు చెప్పకుండా ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. పది నెలల క్రితం గంగరాజు, మౌనిక పెళ్లి జరిగింది. ఇద్దరూ అదే గ్రామంలో ఉంటూ సంతోషంగా ఉంటున్నారు.
మౌనికను చంపేందుకు గంగోత్రి ఆమె ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలియని మౌనిక స్నేహితురాలిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. కొంచెం సేపు ఇద్దరి మధ్య పిచ్చాపాటి మాటలు నడిచాయి. ఆ తర్వాత గంగరాజు పెళ్లి విషయంలో మౌనికతో గంగోత్రి గొడవ పెట్టుకుంది. ఆ గొడవ కాస్తా ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో గంగోత్రి మౌనిక గొంతు కోసి అక్కడి నుంచి పరారయింది. ఈ ఘటన జరిగిన సమయంలో గంగరాజు ఇంట్లో లేడు.