హసన్: ‘పల్లెటూర్లలో పట్టింపులు ఎక్కువ’ అనే మాట వినే ఉంటారు. కానీ.. ఈ పట్టింపుల గురించి ఎక్కువగా పట్టించుకుంటే లేనిపోని శత్రుత్వాలు పెరగడం తప్ప మిగిలేది ఏం ఉండదని తాజాగా కర్ణాటకలో జరిగిన ఈ ఘటన రుజువు చేసింది. కర్ణాటకలోని హసన్ జిల్లా అర్సికెరె తాలూకాలోని పుర్లెహళ్లి అనే గ్రామానికి చెందిన గిరీష్, శరత్ (28) అనే ఇద్దరు యువకులు వారి కుటుంబాలతో కలిసి శకరాయపట్నం సమీపంలో ఉన్న చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లారు.
పల్లెటూర్లలో ఇలా ఆలయాల్లో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లే సమయంలో బంధువులను, సన్నిహితులను పిలుచుకోవడం పరిపాటి. గిరీష్, శరత్ కూడా వారి కుటుంబాలకు సన్నిహితులైన వారిని పిలుచుకున్నారు. మధ్యాహ్నం అమ్మవారికి పొట్టేలును బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం వెళ్లిన వాళ్లంతా కలిసి మొక్కులో భాగంగా బలి ఇచ్చిన పొట్టేలు కూర వండుకుని భోజనాలు చేశారు.
అయితే.. ఈ కార్యక్రమానికి గిరీష్ తన బంధువైన నటరాజును, అతని కుటుంబాన్ని ఎందుకో పిలవలేదు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత అందరూ సాయంత్రం గ్రామానికి చేరుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే.. నటరాజు, అతని కుటుంబం మాత్రం తమను ఈ కార్యక్రమానికి పిలవకపోవడంపై ఆరోజు సాయంత్రం ఊళ్లో నానా రచ్చ చేశారు. గిరీష్‌తో, శరత్‌తో, ఇరు కుటుంబాలతో ఈ విషయంలో గొడవ పెట్టుకున్నారు.
ఊళ్లో అయినవాళ్లందరినీ పిలుచుకుని మమ్మల్ని ఎలా మర్చిపోతారంటూ ఘర్షణకు దిగారు. ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరగడంతో ఊరి పెద్దలు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేసి అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయంలో ఊరి పెద్దలు కూడా నటరాజు కుటుంబ తీరును తప్పుబట్టారు. నలుగురిలో అవమానం జరిగిందని భావించిన నటరాజు గిరీష్, శరత్‌పై పగ పెంచుకున్నాడు.
అదే రోజు గిరీష్, శరత్ ఇంటికి వెళ్లిన నటరాజు క్షణికావేశంలో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శరత్, గిరీష్‌తో పాటు రాకేష్, యోగేష్ అనే మరో ఇద్దరు యువకులు కూడా గాయపడ్డారు. నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శరత్‌ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. 28 ఏళ్ల వయసున్న కొడుకు.. రేపోమాపో పెళ్లి చేయాలని భావిస్తున్న తరుణంలో ఇలా ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరయింది.
తమకు ఇంత కడుపుకోత మిగిల్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితుడి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అందరితో బాగుంటూ నవ్వుతూ పలకరించే శరత్ ఇక లేడనే చేదు నిజాన్ని ఆ కుటుంబంతో పాటు గ్రామస్తులూ జీర్ణించుకోలేకపోతున్నారు. క్షణికావేశం ఎంత నష్టం చేస్తుందో ఈ ఘటన చెప్పకనే చెబుతోంది. ఇంత చేసి నటరాజు ఏం సాధించినట్టు. అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. చిన్నచిన్న విషయాలకు ఎదుటి వారిపై ద్వేషం పెంచుకోవడం, పగపట్టి వారికి హాని తలపెట్టి ఏదో సాధించాలనుకోవడం వంటి విపరీత ఆలోచనల పర్యవసానం చివరికి ఇలాంటి పరిస్థితిని తెచ్చిపెడుతుంది.