అలాగే, భార్యతో సంతోషంగా జీవించాలని కలలు కన్నాడా యువకుడు. కానీ పెళ్లయిన ఆరో రోజునే అతనికి తట్టుకోలేని షాకిచ్చిందా కొత్త పెళ్లి కూతురు. అన్నకు రాఖీ కట్టాలని, పక్క ఊరికి వెళ్తానని పట్టుబట్టింది. భార్య మంకుపట్టు చూసి, సరే ఎంతైనా అన్నకు రాఖీ కట్టాలంటోంది కదా అని సరేనన్నాడా కొత్త పెళ్లి కొడుకు. అలా అనడమే అతని కొంప ముంచింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ ఉత్తమ్ భోడ్కే (32) వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. నెవాసా ప్రాంతంలో దుకాణం నడిపే అతనికి పెళ్లికాలేదు. కొన్ని రోజుల క్రితం సుమన్బాయి సాల్వే, అంజలీ పవార్ అనే ఇద్దరు మహిళలు అతనికి ఒక సంబంధం తీసుకొచ్చారు. వీళ్లిద్దరూ పాంధర్పూర్కు చెందిన వాళ్లు.
వీళ్లు తీసుకొచ్చిన సంబంధమే పాతికేళ్ల సుభాంగి ప్రభాకర్ భోయర్. ఆగస్టు 24న సంతోష్, సుభాంగి ఇద్దరికీ స్థానిక ఆలయంలో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో సంతోష్ తండ్రి.. కొత్త కోడలికి రూ.40వేల విలువైన నగలు, రూ.50వేల నగదు బహుమతిగా ఇచ్చాడు. సంబంధం తీసుకొచ్చినందుకు సుమన్బాయి, అంజలీ ఇద్దరూ రూ.2లక్షల ఫీజు కూడా పిండుకున్నారు.