స్పుత్నిక్-వి వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్‌లో దాదాపు 14 శాతం మంది వాలంటీర్లు జ్వరం, బలహీనత, ఇతర అనారోగ్యాల బారిన పడినట్టు రష్యా ఆరోగ్య మంత్రి చెబుతున్నారు.ఇప్పటికే భారత్‌తో సహా ఇతర దేశాలకు తమ వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న రష్యా, ఇంతకు ముందు రెండు దశల్లోనే ట్రయల్స్ నిర్వహించింది. తాజాగా తుది దశ ట్రయల్స్‌లో వాలంటీర్లపై దుష్ప్రభావాలు బయటపడుతున్నాయి.
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో బలహీనత, కండరాల నొప్పి, జ్వరం వంటి దుష్ర్పభావాలు కనిపించినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లలో, ప్రతి ఏడుగురిలో ఒకరికి ఇలాంటి అనారోగ్యాలు తలెత్తినట్టు తెలిపారు. మూడు దశల ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే 300 మందికి పైగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఇచ్చామని ఆయన చెప్పారు. వారిలో 14శాతం మందిలో అనారోగ్యాలు వెలుగుచూశాయని వివరించారు.
భారత్ లోనూ ప్రయోగాలు
భారతదేశానికి 100 కోట్ల టీకా డోసులను సరఫరా చేస్తామని రష్యా ప్రకటించిన కొద్ది గంటలకే ఈ వార్త బయటకు రావడం విశేషం. డాక్టర్ రెడ్డీస్ సంస్థతో కలిసి తమ వ్యాక్సిన్‌పై భారత్‌లో తుది దశ ట్రయల్స్ పరీక్షలు చేస్తామని, ఆ తరువాత దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి సహకరిస్తామని రష్యా ప్రభుత్వం తెలిపింది.
డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు రాగానే ‘స్పుత్నిక్-వి’ ఫైనల్ ట్రయల్స్‌ను మన దేశంలో ప్రారంభించనున్నారు. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఆర్డీఐఎఫ్ సంస్థే ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ట్రయల్స్ తరువాత మన దేశానికి అవసరమైనన్ని డోసులను అందిస్తామని కూడా ఆసంస్థ తెలిపింది.
మొదటి నుంచీ అనుమానాలే
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ విజయవంతమైనట్టు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ సైతం గతంలో ప్రకటించింది. వ్యాక్సిన్ మొదటి, రెండవ దశల్లో పాల్గొన్న వాలంటీర్లు ఎలాంటి అనారోగ్యాలకు గురికాలేదని, ఆ ప్రయోగాల్లో వంద శాతం సత్ఫలితాలు వచ్చాయని లాన్సెట్ ధ్రువీకరించింది. స్పుత్నిక్-వి ప్రపంచంలో మొట్టమొదటి కరోనావైరస్ వ్యాక్సిన్ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 11 న ప్రకటించారు. కానీ పాశ్చాత్య దేశాలు ముందు నుంచీ దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు వ్యాక్సిన్ పంపిణీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచిచూడాల్సిందే.